దుర్గ గుడి గోశాలలో ఐదు ఆవులు మృతి

 

బెజవాడ కనకదుర్గ దేవాలయానికి చెందిన గోశాలలో గోవులకు పాడైపోయిన పదార్థాలు పెట్టడంతో ఐదు ఆవులు మరణించాయి.బుధవారం ఉదయం గోశాల సిబ్బంది పెట్టిన గోధుమరవ్వ తిన్న ఐదు ఆవులు నురగలు కక్కుకుంటూ మరణించాయి. మరో 20 ఆవులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాయి. గోధుమరవ్వ తినడం కారణంగానే ఆవులు మరణించినట్టు సమాచారం. ఇంద్రకీలాద్రి కొండదిగువన అర్జున వీధిలో ఈ గోశాల వుంది. ఇక్కడ దాదాపు ఐదు వందల ఆవులు వుంటాయి. గోశాలను సందర్శించే భక్తులు వాటికి అన్నం, ఇతరత్రా ఆహారం పెడుతుంటారు. విజయవాడలోని ఒక సంస్థకు చెందిన ప్రతినిధులు ఇచ్చిన గోధుమరవ్వను బుధవారం ఉదయం గోవులకు పెట్టినట్టు తెలుస్తోంది. గోవుల మృతిపై గోశాల సంరక్షణ కమిటీ విచారణ ప్రారంభించింది.