వికారుద్దీన్ పీడ విరగడైంది
posted on Apr 7, 2015 12:50PM
తెలంగాణ పోలీసుల అదుపులో వున్న ఐఎస్ఐ ఉగ్రవాది వికారుద్దీన్ ఎన్‌కౌంటర్లో మరణించాడు. వికారుద్దీన్‌తోపాటు సయ్యద్ అంజాద్, మహ్మద్ అనీఫ్, మహ్మద్ జకీర్, ఇజార్ ఖాన్ అనే మరో నలుగురు తీవ్రవాదులు కూడా ఎన్‌కౌంటర్ అయ్యారు. నల్గొండ జిల్లా ఆలేరు - వరంగల్ జిల్లా పెంబర్తి మధ్య జాతీయ రహదారి మీద మంగళవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ముఠాను మంగళవారం ఉదయం వరంగల్ జిల్లా జైలు నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్కార్ట్ వాహనం నల్గొండ జిల్లాలోకి ప్రవేశించగానే గన్ మన్ దగ్గర వున్న తుపాకీని లాక్కోవడానికి వికారుద్దీన్ ముఠా సభ్యులు ప్రయత్నించారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో వికారుద్దీన్‌తోపాటు మరో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ సమయంలో పోలీసుల అదుపుల్లో మొత్తం 18 మంది తీవ్రవాదులు వున్నారు. వికారుద్దీన్‌ది ఘనమైన నేర చరిత్ర. దోడిపీల ద్వారా డబ్బు సంపాదించే వికారుద్దీన్‌కు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయి. గతంలో ఎన్నోసార్లు వికారుద్దీన్ పోలీసులపై కాల్పులు జరిపాడు. దోపిడీలు చేసి సంపాదించే డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించేవాడు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఆరుగురు పోలీసులను కాల్చి చంపాడు. గతంలో గుజరాత్ హోంమంత్రిపై దాడి కేసులో వికారుద్దీన్ నిందితుడు. గతంలో నరేంద్రమోదీని కూడా చంపేందుకు యత్నించాడు.