ఆ 1800 మంది ఎవరు?
posted on Apr 7, 2015 10:55AM
ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలోని సౌతెర్రైనీ నగరంలోని ఒక ప్రాచీన క్వారీలో దాదాపు 1800 మంది వ్యక్తుల పేర్లు చెక్కి వున్నాయి. ఈ విషయాన్ని మెక్సికోకి చెందిన ఫొటోగ్రాఫర్ జెఫ్రే గస్కీ కనుగొన్నాడు. ఈ క్వారీలోని ఒక గుహలాంటి ప్రదేశంలో దాదాపు 1800 మంది పేర్లను చాలా దశాబ్దాల క్రితం చెక్కారు. ఈ విషయం బయటపడటంతో ఈ ప్రాంతంలోని ప్రజలు ఈ పేర్లను చూడటానికి క్యూలు కట్టారు. ఇంతకీ ఈ క్వారీ గుహల్లో వున్న ఈ పేర్లు ఎవరివి? ఎందుకిలా రాశారు? ఎవరైనా వారిని బంధిస్తే వారి పేర్లు రాసుకున్నారా... ఇలాంటి సందేహాలు అందర్నీ చుట్టుముట్టాయి. పేర్లన్నీ శిలా ఫలకాల మీద, రాళ్ళమీద రాసి వున్నాయి. పేర్లతోపాటు వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు, వాళ్ళ చిరునామా కూడా రాసి వుంది. ఇవన్నీ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుల పేర్లు అయి వుండవచ్చని పలువురు చరిత్రకారులు అంటున్నారు. ఈ పేర్ల వెనుక వున్న గుట్టును బయటపెట్టడానికి భారీ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి.