చెన్నైలో బౌ..బౌ బిర్యానీ..?

చెన్నై మహానగరంలో భోజనప్రియులు ఉలిక్కిపడేలా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. నగరంలో కుక్కమాంసంతో బిర్యానీ తయారు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.  కొద్ది రోజుల క్రితం పలు హోటళ్లలో మేక మాంసం పేరిట పశుమాంసాన్ని వండి పెడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. అనంతరం రోడ్డు పక్కన తోపుడు బండ్లలో బిర్యానీని పిల్లిమాంసంతో చేస్తున్నట్లు ఆధారాలతో సహా తేల్చారు పీపుల్‌ ఫర్‌ కెటిల్‌ ఇన్‌ ఇండియా (పీఎఫ్‌సీఐ) ప్రతినిధులు. దీంతో పాటుగా తోపుడు బండ్ల వారికి పిల్లులను విక్రయిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ముగిసిందో లేదో పలు హోటళ్లు, రోడ్ల వెంబడి దుకాణాల్లో కుక్క మాంసంతో బిర్యానీ చేసి విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మళ్లీ రంగంలోకి దిగిన పీఎఫ్‌సీఐ, పోలీసులు బెంగళూరులోనూ ఇటువంటి ఘటనలే చోటు చేసుకోవడంతో చెన్నైలోనూ ఈ తరహా ఘటనకు అవకాశం ఉండవచ్చనే కోణంలో వివిధ హోటళ్లపై నిఘా ఉంచారు.