మమతను జుట్టుపట్టి ఈడ్చిపారేయాల్సింది
posted on Dec 12, 2016 10:42AM
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా జార్గ్రామ్‌లో నిన్న జరిగిన బీజేపీ యువజన విభాగం సమావేశంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పాల్గొని ప్రసంగించారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమతను జుట్టుపట్టి ఈడ్చి పారేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుతో మమత వేలకోట్లు నష్టపోయారని, సడన్ స్ట్రోక్ వల్ల ఆమెకు మతి భ్రమించిందని దిలీప్ వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో ర్యాలీ చేస్తున్నపుడు జుట్టు పట్టి పక్కకు లాగి పారేసి ఉండవచ్చు..అక్కడున్న పోలీసులు మా వాళ్లే అయినప్పటికీ తాము అలా చేయలేదంటూ దిలీప్ చెప్పారు. మమత తప్పులను బెంగాల్ ప్రజలు గుర్తిస్తున్నారనీ, ఇకపై ఆమె చర్యలను తాము క్షమించబోమని ఘోష్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. నోట్ల రద్దుతో అప్రతిష్టపాలైన బీజేపీ వ్యక్తిగత బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించింది. కోట్లాది మంది సామాన్యుల పక్షాన పోరాడుతున్న మమతా బెనర్జీకి ఎదురు నిలవలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించింది.