జగన్ కు బిగ్ షాక్... టీడీపీలోకి కడప వైసీపీ నేత! 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ముందు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి  ముఖ్య నేత ఝలక్ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నానని ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన నేత వైసీపీకి గుడ్ బై చెప్పి.. తెలుగు దేశం పార్టీలో చేరుతుండటం చర్చనీయాంశంగా మారింది. 

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తిలో  ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కడప జిల్లా రాయచోటికి చెందిన వైసీపీ నేత రాంప్రసాద్ రెడ్డి కలిసారు. ఆయన ఈనెల 14వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. రాయచోటిలో బలమైన నేతగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి వైసీపీని వీడటం కలకలం రేపుతోంది. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాయచోటి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డితో విభేదాల వల్లే ఆయన టీడీపీలో చేరుతున్నారని చెబుతున్నారు. 

శ్రీకాళహస్తిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. ఆయన రోడ్‌షో, ప్రచార సభలకు జనం పోటెత్తారు. అడుగడుగునా ఆయనకు నీరాజనం పట్టారు. పట్టణంలోని  ప్రధాన రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. చంద్రబాబును చూసేందుకు మహిళలు, వృద్ధులు  పెద్ద ఎత్తున ఎగబడ్డారు. చంద్రబాబు అభివాదం చేసిన ప్రతి సందర్భంలోనూ కేరింతలు కొట్టారు. ప్రధాన రహదారుల వెంబడీ అటూ ఇటూ వున్న భవనాలపై నుంచీ ఆయనపై పూలవర్షం కురిపించారు. సూపర్‌ బజారు ప్రాంతంలో అయితే ఆయన రావడానికి ముందే రోడ్డంతా పూలతో నిండిపోయింది.

ఇక చంద్రబాబు ప్రసంగానికి సైతం సభకు హాజరైన జనం నుంచీ పెద్దఎత్తున స్పందన కనిపించింది.దీంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అటు వైసీపీలో మాత్రం కలవరం మొదలైందని అంటున్నారు.