హిడ్మా కథ ముగిస్తాం..! సీఆర్పీఎఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో 22 మంది జవాన్లను బలి తీసుకున్న మావోయిస్టులపై ప్రతీకారానికి సీఆర్పీఎఫ్ సిద్దమవుతోంది. మోస్ట్ వాంటెడ్ హిడ్మా టార్గెట్ గా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నక్సల్స్‌ కమాండర్‌ హిడ్మా చరిత్రలో కలిసిపోవడం ఖాయమని సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌ అన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైనట్లు చెప్పారు. నక్సలైట్ల పరిధి.. అడవుల్లో 100 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుచించుకుపోయిందని, ఇక తప్పించుకోవడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిలోగా హిడ్మాతో పాటు ఆయన దళం  కథ ముగిస్తామన్నారు సీఆర్పీఎఫ్ డైరెక్టర్. 

బీజాపూర్ ఎన్ కౌంటర్. మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న రాకేశ్వర్ సింగ్ విడుదల తర్వాత మాట్లాడిన కుల్దీప్‌సింగ్‌ .. కీలక విషయాలు వెల్లడించారు. హిడ్మా లక్ష్యంగా  చేపట్టబోయే యాక్షన్‌ ప్లాన్‌ గురించి కూడా వివరించారు. మావోయిస్టులపై పోరు మరింత ఉద్ధృతం చేస్తున్నట్లు కుల్దీప్‌సింగ్‌  తెలిపారు. మావోయిస్టుల ఏరివేత విషయంలో క్రమంగా బలగాలు పుంజుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారు అష్టదిగ్బంధనానికి దగ్గర్లో ఉన్నారని.. అంతమవడం లేదా పారిపోవడం మాత్రమే వారికి మిగిలిన అవకాశాలని పేర్కొన్నారు. వారు తలదాచుకున్న ప్రాంతాలను గుర్తించి బయటకు తీసుకొస్తామన్నారు. ఇదంతా ఓ ఏడాదిలోపు పూర్తవుతుందన్నారు సీఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కుల్దీప్‌సింగ్‌. 

బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో హిడ్మా  పన్నిన వ్యూహంలో  భద్రతా బలగాలు చిక్కుకున్నాయన్న వాదనను కుల్దీప్‌ సింగ్ తోసిపుచ్చారు. ఒకవేళ నిజంగానే వారు పన్నిన వ్యూహంలోకి బలగాలు వెళ్లి చిక్కుకుంటే మరణాలు ఇంకా తీవ్రస్థాయిలో ఉండేవని చెప్పారు. ఈ ఘటనలో నక్సల్స్‌ కూడా చాలా మందే మృతిచెందినట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిని తరలించేందుకు నక్సల్స్‌ 4 ట్రాక్టర్లను వినియోగించినట్లు తెలిపారు. బుల్లెట్లు వర్షంగా కురుస్తున్నా.. వాటిని తప్పించుకుంటూ, గాయపడిన వారిని కాపాడుకుంటూ బలగాలు సమర్థంగా పనిచేశాయని, వారి పట్ల గర్వంగా ఉన్నానని కుల్దీప్‌ తెలిపారు. పూర్తిస్థాయిలో బలగాలు సన్నద్ధంగా లేవంటూ వస్తున్న వాదనలను కూడా ఆయన తోసిపుచ్చారు. 

ఈ ఆపరేషన్‌ కోసం బీజాపూర్  ప్రాంతంలోకి దాదాపు 450 మంది జవాన్లు వెళ్లారని, 7 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో వారు మావోయిస్టులతో పోరాడినట్లు  కుల్దీప్‌ సింగ్  తెలిపారు.  నక్సలైట్ల దాడి నిరంతరంగా సాగిందని, జవాన్లు వారిని కాచుకుంటూనే తిరిగి ఎదురుకాల్పులు జరిపారని.. బలగాల వైపు గాయపడిన వారిని కూడా తమతో తీసుకువచ్చారని వివరించారు. అదనపు బలగాల కోసం కూడా సందేశం ఇచ్చారన్నారు. 22 మంది జవాన్లు ఆ దాడిలో అమరులవ్వడం బాధాకరమన్న కుల్దీప్‌.. వారి బలిదానాలు వృథా కాబోవన్నారు.  ఏడాదిలోగా హిడ్మా అంతు చూస్తామని హెచ్చరించారు. 

భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారిన సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా వయసు 40 ఏళ్లు ఉంటుందని అంచనా. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2013లో ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నేతలపై జరిగిన దాడిలో కూడా హిడ్మానే నిందితుడు.