విమానంలో బట్టలు విప్పేసి.. సిబ్బందితో...

అసలే ఎండాకాలం. అందులోను ఉక్కపోత. కానీ విమానం గాల్లో ఎగురుతుంది. అందులో ఒక ప్రయాణికుడు గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే.. తేనే పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే అని జల్సా పాట వేసుకున్నాడు. పీకలదాక తాగి హల్‌చల్ చేశాడు. 

ఏప్రిల్ 6న బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఐ5-722 విమానంలో ప్రయాణికుడు మద్యం మత్తులో బట్టలు విప్పేసి.. సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు మొదట లైఫ్ జాకేట్ కోసం విమానం సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఉన్నట్టుండీ పూనకం వచ్చినట్లు ఒంటిపై దుస్తులన్నీ తీసేసి, విమాన సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టాడు. తోటి ప్రయాణికులు, సిబ్బంది బతిమాలడంతో కొద్దిసేపటి తర్వాత కూర్చున్నాడు.

కట్ చేస్తే.. ఈ ఘటనపై విమాన పైలట్లు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ)కి సమాచారం అందించారు. త్వరగా విమానం ల్యాండింగ్‌కు అనుమతించాలని కోరారు. విమానం ల్యాండ్ కాగానే ఆ జల్సా రాయుడిని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. అనంతరం ఎయిర్‌లైన్స్ అధికారులు ఢిల్లీ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పాటు ప్రయాణికుడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్ ఏషియా విమాన సంస్థ ఆ వ్యక్తిని నో ఫ్లై జాబితాలో చేర్చింది.