ఆక్సిజన్‌ తొలగించారు.. బై డాడీ.. అదే చివరి మాట

'ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్‌ బంద్‌ చేశారు. సార్‌ సార్‌ అని బతిమిలాడినా పట్టించుకోలేదు.' అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి తన తండ్రికి పంపించిన కాసేపటికే మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ జవహర్ నగర్ కు చెందిన 35 ఏళ్ల రవికుమార్ కరోనా లక్షణాలతో ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే తనపట్ల వైద్యులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపిస్తూ.. రవికుమార్ ఓ సెల్ఫీ వీడియో తీసి తండ్రికి పంపాడు. ‘ఊపిరి ఆడటం లేదని చెప్పినా ఆక్సిజన్‌ తొలగించారు. సార్‌ సార్‌ అని బతిమిలాడినా పట్టించుకోలేదు. ఇప్పటికే మూడు గంటలైంది. గుండె ఆగిపోయింది. ఊపిరొక్కటే కొట్టుకుంటోంది. బై డాడీ’ అంటూ వాట్సాప్ లో వీడియో పంపాడు. వీడియోలో కొడుకు దయనీయ స్థితిని చూసిన తండ్రి.. ఆ షాక్‌ నుంచి తేరుకునేలోపే కుమారుడు మరణించాడని సమాచారం వచ్చింది.

రవికుమార్ అతని తండ్రికి పంపిన వీడియోని బట్టి చూస్తే.. అతను దాదాపు మూడు గంటల పాటు నరకయాతన అనుభవించి మరణించాడని అర్థమవుతోంది. కాగా, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రవికుమార్ మరణించాడని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అసలు పెట్టిన ఆక్సిజన్‌ ఎందుకు తీసేశారో చెప్పాలని రవికుమార్ తండ్రి ప్రశ్నించారు. నా కుమారుడికి జరిగిన అన్యాయం మరొకరికి జరగవద్దని కోరుకుంటున్నాను అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ట్వీట్ చేశారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన కరోనా బాధితుడి పట్ల ప్రభుత్వ బాధ్యతా రాహిత్య వైఖరికి పరాకాష్ట అని విమర్శిచారు.

కాగా, ఈ ఘటనపై ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి సూపరింటిండెంట్ స్పందించారు. వైద్యుల నిర్లక్ష్యంతో రవికుమార్ చనిపోయాడనడం సరికాదని అన్నారు. కరోనా వైరస్ యువకుల్లో ఎక్కువగా గుండెపై ప్రభావం చూపిస్తుందని, గుండె దెబ్బతిన్న తర్వాత ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం ఉండదని తెలిపారు. రవికుమార్ విషయంలోనూ అదే జరిగిందని సూపరింటిండెంట్ పేర్కొన్నారు.