పాల్వాయి మృతిపై పలువురి సంతాపం..
posted on Jun 9, 2017 3:24PM
.jpeg.jpg)
రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతిపై కాంగ్రెస్ పార్టీనేతలు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు తమ సంతాపాన్ని తెలిపారు.
జానారెడ్డి...
గోవర్థన్ రెడ్డి మృతిపై స్పందించిన జానారెడ్డి పాల్వాయి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాల్వాయి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాన్నారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు
ఉత్తమ్ కుమార్ రెడ్డి...
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్వాయి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాల్వాయి మరణవార్త తెలియగానే ఉత్తమ్‌కుమార్ బంజారాహిల్స్‌లోని పాల్వాయి
నివాసానికి బయలుదేరారు. పాల్వాయి నాలుగు తరాల నాయకుడని..ఆయన మరణం కాంగ్రెస్, తెలంగాణకు తీరని లోటని ఉత్తమ్ కుమార్ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్‌గాంధీ..
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాల్వాయి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని.. పాల్వాయి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య సంతాపం ప్రకటించారు.
కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్వాయి గోవర్థన్‌రెడ్డి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పాల్వాయితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పాల్వాయి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టీటీడీపీ నేతల సంతాపం..
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. టీటీడీపీ నేతలు రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ సంతాపం ప్రకటించారు. పాల్వాయి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.