తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు.. మళ్లీ లాక్‌డౌన్‌!!

తెలంగాణలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజుకి దాదాపు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, 3,227 శాంపిల్స్ ను పరీక్ష చేయగా 983 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో 816 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వాళ్లే కావడం గమనార్హం. కొత్తగా నమోదైన కేసులతో కలిపి.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు సంఖ్య 14,419 కి చేరింది. కొత్తగా నాలుగు మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 247కి చేరింది. ఇప్పటివరకు 5,172 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 9 వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతానికి పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి. దీంతో, గ్రేటర్‌‌ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. స్వయంగా సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని సూచన ప్రాయంగా తెలిపారు. హైదరాబాద్‌లో 15 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని సీఎం చెప్పారు. కరోనా‌ నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేస్తామని, అలాగే హైదరాబాద్‌లో కొద్దిరోజులు తిరిగి లాక్‌డౌన్‌ విధించాలనే ప్రతిపాదనలపైనా తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వెలుగుచూస్తున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం సర్కార్ మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశం కనిపిస్తోంది.