అందుకే చంద్రబాబు జూన్ 2ని ఎంచుకొన్నారా?

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినంగా పాటించాలని నిర్ణయించింది. అయితే ఈఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించకుండా నవ నిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ర్యాలీలు, సభలు నిర్వహించి రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలను కూడా భాగస్వాములయ్యేందుకు ప్రోత్సహించాలని నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై భిన్నాభిప్రాయాలున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం అధికారికంగా విభజించబడిన జూన్ 2వ తేదీనే రాష్ట్ర అవతరణ దినంగా నిర్ణయించడం వెనుక చాలా బలమయిన కారణాలే కనబడుతున్నాయి.

 

రాష్ట్ర ప్రజల అభిమతానికి విరుద్దంగా జరిగిన రాష్ట్ర విభజనను ఆ తేదీ ప్రజలందరికీ ఎల్లపుడూ గుర్తు చేస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కసితో పనిచేసేందుకు ప్రేరేపిస్తుందని ఆయన అన్నారు. ప్రజలందరినీ ప్రేరేపించడం మాటెలా ఉన్నప్పటికీ, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొన్న ప్రతీసారి ఎటువంటి పరిస్థితులలో రాష్ట్రం విడిపోయిందో, విభజనకు ముందు తరువాత పరిణామాలు, రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం ఎదుర్కొన్న అనేక సమస్యలు, సవాళ్లు, అవమానాలు అన్నీ గుర్తుకురాక మానవు. అదే సమయంలో ఇందుకు కారణమయిన కాంగ్రెస్ పార్టీ, అది ప్రజల అభిమతానికి విరుద్దంగా వ్యవహరించిన తీరు, పార్లమెంటులో విభజన బిల్లును ఆమోదించిన తీరు వగైరా అన్నీ ప్రజల కళ్ళ ముందు సినిమా రీలులా కదలాడకమానవు.

 

అదేసమయంలో విభజన తరువాత రాష్ట్ర పరిస్థితి, కాలక్రమంలో రాష్ట్రాభివృద్ధి జరిగిన తీరు అందుకు ప్రభుత్వాలు చేసిన కృషి, ముఖ్యంగా అత్యంత క్లిష్ట సమయంలో అధికారం చేప్పటిన తెలుగుదేశం ప్రభుత్వం మొదటి ఐదేళ్ళలో ఎదురయిన అనేక సవాళ్ళను ధీటుగా ఎదుర్కొని ఏవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినది కూడా జ్ఞప్తికి రావడం తధ్యం.

 

ఇక మరో ముఖ్యమయిన విషయం జూన్ 2నే రాష్ట్రావతరణ దినోత్సవంగా నిర్ణయించడం ద్వారా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మొండిగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇకపై రాష్ట్రావతరణ దినోత్సవం జరిన ప్రతీసారి తను చేసిన తప్పుకి సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి చంద్రబాబు నాయుడు కల్పించారని భావించవచ్చును. చంద్రబాబు నాయుడు చాలా దూరం ఆలోచించి కాంగ్రెస్ పార్టీని చాలా నేర్పుగా శిక్షించినట్లు కనబడుతోంది.