చంద్రబాబుకు అప్పుడున్న భయం ఇప్పుడు పోయిందా?

 

ఒకపక్క ప్రత్యేక రాష్ట్ర కావాలని తెలంగాణ వాదులు.. మరోపక్క రాష్ట్ర విభజన జరగడానికి వీలులేదని సీమాంధ్ర ప్రజల ఆరోపణలు.. అన్ని గొడవల మధ్య ఎట్టకేలకు రాష్ట్ర విభజన జరిగింది. అయితే ఈ విభజన వల్ల తెలంగాణ రాష్ట్రం సంగతి ఏమో కాని ఏపీకి మాత్రం నష్టం జరిగిందనే అనుకోవచ్చు. కొత్త రాష్ట్రం.. రాజధాని లేదు.. ప్రభుత్వ కార్యాలయాలు లేవు.. రాష్ట్రం విడిపోయిన హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఏలాగో అక్కడి నుండే పాలన కొనసాగించుకోవాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఏపీ అభివృద్ధి చేయాలంటే దానికి కాస్తంత ధైర్యం ఉండాలనే చెప్పాలి.  మరి అలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏపీ అభివృద్ధిని తలపెట్టిన చంద్రబాబుకు దైర్యం ఉందనే చెప్పాలి. కానీ మొదట్లో చంద్రబాబుకు కూడా విమర్శలు తప్పలేదు. తలపెట్టిన ప్రతి పని రివర్స్ అవడం.. ప్రతిపక్షనేతల విమర్శలు ఇవన్నీ ఆయనకు పెద్ద తలనొప్పిగానే.. భయంగాను తయారయ్యాయి. కానీ రాను రాను పరిస్థితి కొంచెం మారింది. ఏపీని అభివృద్ధి పంథాలో నడపడానికి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారు. విదేశాలనుండి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అంతేకాదు ప్రపంచ బ్యాంకే ఏపీ పెట్టుబడులు పెట్టుకోవడానికి అనువైనది అని చెప్పి రెండో స్థానాన్నికల్పించింది.. అంతేకాక విద్యుత్ పంపిణీ సరఫరాల నేపథ్యంలో ఏపీ ఘనత మరో మెట్టు ఎక్కింది.. కేంద్ర ప్రభుత్వమే విద్యుత్ సరఫరాల నష్టాల తగ్గింపులో ఏపీని చూసి నేర్చుకోండి అంటూ సూచన కూడా చేసింది. 2022 నాటికి ఖచ్చితంగా రాష్ట్రంలో 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తిచేస్తామని ధీమా కూడా వ్యక్తం చేశారు. అంతేకాదు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నదులు అనుసంధానం చేసి జాతీయస్థాయి క్రెడిట్ కూడా చంద్రబాబు ఖాతాలో చేరింది. మొత్తానికి చంద్రబాబు రాష్ట్రం విడిపోయిన తరువాత ఎంత మదన పడ్డారో.. ఎంత భయపడ్డారో ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో కాస్తంత స్థిమితపడినట్టు తెలుస్తోంది. అప్పుడు ఉన్న భయం ఇప్పుడు లేదని తెలుస్తోంది.