కరణం బలరాం హోం కమింగ్.. నిజమేనా?

ప్రకాశం జిల్లాకు చెందిన బలమైన రాజకీయ నాయకులలో  కరణం బలరాం కూడా ఒకరు. చీరాల మాజీ ఎమ్మెల్యే అయిన కరణం బలరాం  గతంలో తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అంతే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోడెల శివప్రసాద్,  కేసీఆర్, కరణం బలరాంలు నారా చంద్రబాబునాయుడికి అత్యంత విధేయులుగా, ఇంకా చెప్పాలంటే ఆయనకు సూసైడ్ స్క్వాడ్ గా గుర్తింపు పొందారు. అంటే చంద్రబాబు చూసి రమ్మంటే కాల్చివచ్చే నేతలు అన్న మాట. అలాంటి వారిలో  తరువాతి కాలంలో ముందు కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరమై సొంతంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ స్థాపించి.. రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత కరణం బలరాం కూడా 2019 తరువాత తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. అక్కడ సరైన గుర్తింపు లేక ఇబ్బందులు పడ్డారనుకోండి అది వేరే సంగతి. కరణం బలరాం తెలుగుదేశం తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా  గెలిచారు.   2019 ఎన్నికలలో చీరాల నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన కరణం బలరాం ఆ తరువాత వైసీపీ గూటికి చేరారు. అంతకు ముందు వరకూ ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కరణం బలరాం తెలుగుదేశం వీడి వైసీపీలో చేరడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తన కుమారుడి రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని 2024 ఎన్నికలలో తన స్థానంలో కుమారుడిని పోటీలో దింపాలన్న ఆలోచనతోనే కరణం బలరాం వైసీపీ గూటికి చేరారని అప్పట్లో పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు.

ఏది ఏమైనా కరణం బలరాం తెలుగుదేశం పార్టీని వీడి జగన్ పంచన చేరడంతో తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పార్టీ నుంచి పదవులు, గుర్తింపు పొంది పార్టీ కష్టకాలంలో ఉండగా గోడదూకేయడంతో బలరాంకు చీరాల నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా క  నిరసన సెగలు తగిలాయి. అయితే వాటిని వేటినీ కరణం బలరాం పట్టించుకోలేదు. ఆయన కోరుకున్నట్లుగానే 2024 ఎన్నికలలో చీరాల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన కుమారుడు కరణం వెంటేష్ పోటీ చేశారు. అయితే ఘోర పరాజయం పాలయ్యారు. వైసీపీ పార్టీ కూడా పరాజయం మూటగట్టుకుని రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. 

ఆ తరువాత కరణం వెంకటేష్ కు జగన్ జిల్లా పార్టీ  అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కరణం బలరాం ఆశించారు. అయితే జగన్ మాత్రం పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని మేరుగ నాగార్జునకు కట్టబెట్టారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కరణం బలరాం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన కుమారుడితో సహా తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారానికి బలం చేకూర్చే సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. 

రాష్ట్రంలో వైసీపీ పరాజయం తరువాత ఎక్కడా బయటకు కనిపించని కరణం బలరాం విజయవాడను వరదలు ముంచెత్తిన సమయంలో వరద బాధితులకు సహాయం అందించడానికి ఒక సారి బయటకు వచ్చారు. ఆ సమయంలో వైసీపీ నేతలు ఎవరూ కూడా వరద బాధితుల వైపు కనీసం తొంగి కూడా చూడలేదు. వైసీపీ అధినేత ఒక సారి వరద బాధితుల పరామర్శకు వచ్చినా కేవలం గంటా రెండు గంటల వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి మమ అనిపించేశారు. వరద బాధితులను పార్టీ తరఫున ఆదుకుంటామని ప్రకటించిన ఆయన సీఎం సహాయ నిధికి పార్టీ నేతలెవరూ విరాళాలు ఇవ్వవద్దని పిలుపు ఇచ్చారు. వైపీపీ తరఫున కోటి రూపాయలు సహాయం ప్రకటించేసి చేతులు దులిపేసుకున్నారు. అయితే పార్టీ అధినేత పిలుపునకు భిన్నంగా వరద సహాయ కార్యక్రమాలలో కరణం బలరాం పాల్గొన్నారు. తెలుగుదేశంతో కలిసి నడవకపోయినా, సొంత స్థాయిలోనే ఆయన అప్పట్లో సహాయ కార్యక్రమాలు చేశారు. 

ఆ తరువాత ఇటీవల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి మనవడి వివాహ నిశ్చితార్థ వేడుకలో కరణం బలరాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఇరువురూ కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. ఆ సందర్భంగా వారు ఏం మాట్లాడుకున్నారన్నది తెలియకపోయినా అప్పట్లోనే కరణం బలరాం తెలుగుదేశం గూటికి చేరనున్నారని రాజకీయవర్గాలలో బలంగా వినిపించింది. అప్పట్లో కరణం బలరాం చంద్రబాబుతో ముచ్చటిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

ఇక ఇప్పుడు తాజాగా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు కరణం బలరాం హాజరయ్యారు. ఆ సందర్భంగా తెలుగుదేశం నాయకులతో కలివిడిగా కనిపించారు. దీంతో కరణం బలరాం తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమంటూ పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికీ దశాబ్దాల పాటు అత్యంత విధేయుడిగా ఉన్న కరణం బలరాం 2019 ఎన్నికల తరువాత కేవలం కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం అయిష్టంగానే తెలుగుదేశం గూటికి చేరారని అప్పట్లోనే వినిపించింది. ఇప్పుడు కరణం బలరాం కదలికలు, వ్యవహార శైలీ అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో కరణం బలరాం పట్ల తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో కూడా ఒకింత సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది. బేషరతుగా ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సుముఖత చూపితే అహ్వానించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.