వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై టెక్కలి పీఎస్ లో ఫిర్యాదు
posted on Nov 18, 2024 2:15PM
వైసీసీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. దువ్వాడ శ్రీనివాస్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. దివ్వెల మాధురితో ఆయన సాన్నిహిత్యం, అనుబంధం కారణంగా ఎపిసోడ్ గత కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ పేరు నిత్యం వార్తలలో వినిపిస్తోంది. కనిపిస్తోంది. ఆయన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా టెక్కలి పోలీసు స్టేషన్ లో జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు. పవన్ కల్యాణ్ పైనా, ఆయన కుటుంబం దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. పలువురిని ఇప్పటికే అరెస్టు చేశారు. కోర్టులకు వెళ్లినా కూడా ఊరట లభించడం లేదు. ఇష్ఠారీతిగా నోరు పారేసుకుని శిక్షించవద్దంటూ కోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ఏపీ హైకోర్టు కూడా ఇటీవల వ్యాఖ్యానించింది. రామ్ గోపాల్ వర్మ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయిస్తే.. తరువాత అవసరమనుకుంటే బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోండి, అంతే కానీ అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేయలేమని కోర్టు విస్పష్టంగా చెప్పింది.
అలాగే సోషల్ మీడియా వ్యాఖ్యలపై అరెస్టులను ఆపాలంటూ సీనియర్ జర్నలిస్టు విజయబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగానూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడి, ఇప్పుడు కోర్టును ఆశ్రయించి ఏం లాభం అంటూ చీవాట్లు పెట్టింది. న్యాయమూర్తులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసింది. దీంతో అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు, వైసీపీ నేతలకు ఇప్పుడు అరెస్టుల భయం వెంటాడుతోంది. ఆ క్రమంలోనే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలిలో ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో ఆయనకు కూడా నేడో రేపో పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.