ఎన్టీఆర్‌కి ప్రాంతీయత ఆపాదించొద్దు...
posted on Nov 21, 2014 11:22PM
తెలుగుజాతికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఎన్టీఆర్‌కు ప్రాంతీయత అంటగట్టడం సరైన పని కాదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యానించారు. శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్పుపై జరుగుతున్న రాద్దాంతంపై ఆయన స్పందించారు. శంషాబాద్ పేరు మార్పు నిర్ణయం ఈనాటిది కాదని, 1999లో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం మేరకే శంషాబాద్ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టామని తెలిపారు. విమానాశ్రయం నిర్మించిన తర్వాత 2002లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయం సగమే అమలు చేసిందని ఆయన వివరించారు. దేశీయ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టడం మీద తెలంగాణ అసెంబ్లీ వ్యతిరేకంగా తీర్మానం చేయడంపై కూడా మంత్రి అశోక్‌గజపతి రాజు స్పందించారు. సమాఖ్య విధానంలో ఎవరు ఎక్కడైనా తీర్మానం చేయవచ్చునని ఆయన అన్నారు. వైెఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎన్టీఆర్ పేరును విస్మరించిందని... ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని, మేం కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు.