బొత్సతో వైసీపీ బేరం ఫిక్స్
posted on May 8, 2015 5:12PM
పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బేరం ఫిక్స్ చేసుకుంది. ఈ బేరం సారాంశం ఏమిటంటే, బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి జెల్ల కొట్టి వైసీపీలోకి జంప్ అవుతారు. దానికి ప్రతిఫలంగా బొత్సకు వైసీపీ తరఫున ఏపీ శాసనమండలిలో స్థానం ఇస్తారు. ఈ మేరకు బొత్స, జగన్ మధ్య ఒప్పందం ఖరారు అయినట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో బొత్స వైసీపీలో చేరబోతున్నారు. జంప్ జిలానీ అయిన బొత్సకు ఎమ్మెల్సీ పదవిని జగన్ బంగారు పళ్ళెంలో పెట్టి అందించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోవడానికి బొత్స సత్యనారాయణ కూడా ఒక కారణం. గత ఎన్నికలలో చీపురుపల్లి నుంచి ఓడిపోయిన తర్వాత బొత్సవారు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీలోంచి జంప్ అయిపోవాలా అని ఎదురుచూస్తున్నారు. బీజేపీతో బేరం విఫలమైన తర్వాత ఆయన చూపు వైసీపీ వైపు మళ్ళింది. ఇప్పటికే దుకాణం సర్దేసే స్థితిలో వున్న వైసీపీకి బొత్స రాక మేలు చేస్తుందని పార్టీ నాయకుడు జగన్ భావిస్తున్నారు. వైసీపీని బీజేపీలో విలీనం చేసేసి, కేసుల నుంచి తప్పించుకోవాలని, ఆ తర్వాత బీజేపీ నాయకుడిగా ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కాలన్నది జగన్ కంటున్న కల. అయితే ఈ కలను కార్యరూపంలో పెట్టాలంటే బీజేపీతో రాయబారాలు నడపగల ఒక మధ్యవర్తి అవసరం వుంది. కేంద్రంలోని సీనియర్ బీజేపీ నాయకులతో సత్సంబంధాలు వున్న బొత్స అయితే ఈ మధ్యవర్తి పదవికి న్యాయం చేయగలరన్న నమ్మకంతోనే ఆయనకు పార్టీ తీర్థంతోపాటు ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఏ పనీలేకుండా ఖాళీగా వున్న బొత్స వైసీపీలో చేరిన తర్వాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి తనవంతు కృషి చేస్తారన్నమాట.
ఏ పార్టీలో అయినా పార్టీకి ఎప్పటినుంచో సేవ చేసిన వారిని కాకుండా జంప్ జిలానీలను అందలం ఎక్కించడం అనేది సంప్రదాయంగా మారింది. వైసీపీ కూడా అదే బాటలో నడుస్తోంది. తప్పో ఒప్పో పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఎంతోమంది వున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి జంప్ అయి వస్తున్న బొత్సకు ఎమ్మెల్సీ స్థానం రిజర్వ్ చేయడం పట్ల వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొత్స పార్టీలోకి రాబోతున్నారన్న విషయం తెలుసుకున్న ఉత్తరాంధ్ర వైసీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో వున్నాయి. బొబ్బిలి ఎమ్మెల్యేగా వున్న వైసీపీ నాయకుడు రంగారావు బొత్సను పార్టీలోకి తీసుకుంటే తాను రాజీనామా చేస్తానని బెదిరించారని కూడా సమాచారం. అయితే ఎవరు ఎన్నిరకాలుగా బెదిరించినా, తన పార్టీని బీజేపీలో విలీనం చేసే కలను కంటున్న జగన్ ఆ కలను నిజం చేసే వ్యక్తి బొత్స వారేనని భావిస్తున్నారు. అందుకే ఆయనకు పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతున్నారు. మరి బొత్సగారు వైసీపీలో చేరిన తర్వాత జగన్ కల నిజమవుతుందో, లేక పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగి పరిస్థితి ఇప్పుడున్నదానికంటే ఇంకా దిగజారుతుందో కాలమే తేల్చాలి.