చతుష్టయం ఏకమవుతోందా?
posted on Jul 21, 2018 3:47PM
అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మోదీ గెలిచారు. మరి రాహుల్ గాంధీ, చంద్రబాబులు? వాళ్లు ఓట్ల సంఖ్యతో చూస్తే ఓడిపోయినట్టే! కానీ, అసలు నాలుగేళ్ల తిరుగులేని పాలనలో మోదీ ఇలా జనం ముందు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావటం? అది ప్రతిపక్షాల గెలుపే! ఆ విధంగా చూసినప్పుడు జాతీయ స్థాయిలో రాహుల్, రాష్ట్ర స్థాయిలో బాబు సక్సెస్ అయినట్టే. ముఖ్యంగా, ఏపీ సీఎం జనానికి ప్రత్యేక హోదా ఎవరి వల్ల రావటం లేదో అర్థంమయ్యేలా చేయగలిగారు. హోదా, పోలవరం లాంటివి కేవలం కేంద్రం ఉదాసీనత వల్లే ఆగిపోవటం, మందగించటం జరుగుతోందని ఓటర్లు గ్రహించేలా చేయగలిగారు. దీని ఎఫెక్ట్ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుంది!
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల ప్రత్యేక హోదా రాదనేది అందరికీ తెలిసిన విషయమే. మరి రాజకీయ ఛాణుక్యుడైన చంద్రబాబు ఆ మాత్రం గ్రహించలేరా? ఆయనకూ హోదా రాదని తెలుసు. మోదీ ప్రభుత్వం కూలదనీ తెలుసు. కానీ, అసలు మొత్తం వ్యవహారం వెనుక లాభమేంటో కాస్త లోతుగా ఆలోచిస్తే మనకే తెలుస్తుంది! నిన్న మోదీ సభలో కేసీఆర్ ని, తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. అలాగే, చంద్రబాబుని తాను స్వయంగా వైఎస్ఆర్ సీపీ ట్రాప్ లో పడొద్దని హెచ్చరించానని చెప్పుకొచ్చారు. ఇక ఇక్కడ జనసేనాని కూడా తన ట్వీట్ల రాజకీయం నడిపారు! బీజేపీని తిడుతున్నట్టే ట్వీట్లు చేసి… టీడీపీకి తూట్లు పొడిచే వ్యూహం పన్నారు. తాజాగా పవన్ ట్వీట్లతోనూ , జగన్ ప్రెస్ మీట్లతోనూ చంద్రబాబుపై విరుచుకుపడుతూనే వున్నారు.
బీజేపీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాదని చెప్పిన పవన్ టీడీపీ కూడా బీజీపీతో సమానమై ద్రోహం చేసిదంటూ అర్థం వచ్చేలా వ్యాఖ్యానాలు ఇచ్చారు! ఇక జగన్ మంగళవారం ఏపీ బంద్ అంటూ కొత్త అంకానికి తెర తీశారు. కీలకమైన అవిశ్వాస తీర్మానం చర్చలో తన ఎంపీలు ఎవరూ లేకుండా చేసి బీజేపీని కాపాడిన ఆయనే ఇప్పుడు చంద్రబాబును తూర్పార పడుతూ బంద్ అంటున్నారు! బందుల వల్ల జనం ఇబ్బందులు పడతారు తప్ప… లాభమేంటి? జగన్ కే తెలియాలి!
చంద్రబాబు మీద ఒకవైపు నుంచీ పవన్, మరో వైపు నుంచీ జగన్, ఇక ఇంకో వైపు నుంచీ ఎప్పటిలాగే బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా, పురంధేశ్వరీ… ఇలా అంతా కలిసి ముప్పేట దాడి చేయటం దేనికి సంకేతం? రాబోయే ఎన్నికల్లో టీడీపీ చేయాల్సిన ఒంటరి పోరుకి అవిశ్వాస తీర్మానం మరింత స్పష్టతనిచ్చింది. పైకి పవన్, జగన్ బీజేపిని నాలుగు మాటలంటున్నా ప్రధాన దాడి టీడీపీ మీదే చేస్తున్నారు. అది దిల్లీలోని కాషాయ నేతల డైరెక్షన్లోనే అన్నది బలపరీక్ష సందర్భంగా తేలిపోయింది. జగన్ తన ఎంపీల్ని ఉప సంహరించాడు. గతంలో మద్దతు కూడగట్టుకొస్తానన్న పవన్ ట్వీట్లతో టీడీపీనే దెప్పిపొడిచాడు. వీళ్ల వెనుక బీజేపీ కాక మరెవరు వున్నట్టు? అలాగే, టీఆర్ఎస్ ని, కేసీఆర్ ని మెచ్చుకున్న మోదీ గులాబీ పార్టీని కూడా టీడీపీకి వ్యతిరేకం చేసేశారు! అంటే, 2019లో బీజేపీ తెలంగాణ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ను, ఏపీ టీడీపీకి వ్యతిరేకంగా పవన్, జగన్ లను వాడుకోబోతందన్నమాట! అవిశ్వాసం తేల్చిన సత్యం ఇదే!
అంతా ఒక్కటై దాడి చేస్తోన్న నేపథ్యంలో చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పక పోవచ్చు. రాహుల్ టీడీపీకి, ఏపీకి కాస్త మద్దతుగా మాట్లాడినా… హస్తం పార్టీతో కలిసి ముందుకు సాగటం టీడీపీకి పెద్దగా లాభమూ కాదు. మంచిది కూడా కాదు! కాబట్టి పసుపు సైనికులు ఇప్పట్నుంచే రానున్న కురుక్షేత్రానికి సర్వసన్నధ్దంగా వుండాలి. రాష్ట్రం రెండుగా చీలిన 2014లో కంటే వారికి 2019లోనే పెద్ద సవాలు ఎదురుకానుంది!