కమలంతో కలిసినందుకే మజ్లిస్ దూరమైంది
posted on Jun 5, 2023 3:27PM
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ పని తీరు మీద చేసిన విమర్శలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మిత్ర పక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు ప్రస్తుతం శత్రుపక్షాలుగా మారాయి.
అసదుద్దీన్ చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. షాదీ ముబారక్ వంటి స్కీములను పరిచయం చేసిన బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించడంపై లోతుగా అధ్యయనం చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ప్రచార సమయం నుంచి బిజెపి బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు పూర్తిగా సమసిపోవడమే అసద్ కు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజి వ్యవహారంలో మంత్రి కెటీఆర్ హస్తముందని బిజెపి ఆరోపించగా పదో తరగతి పేపర్ లీకేజి వ్యవహారంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హస్తముందని బిఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. ఇక్కడితో ఆగకుండా బండి సంజయ్ పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటులో పేర్కొంది.అప్పట్లో రేపో, మాపో కవిత అరెస్ట్ అనే ఊహాగానాల ప్రచారం జరిగింది. . తీరా చూస్తే కవిత కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అరెస్ట్ వార్త అటకెక్కడంతో మజ్లిస్ పార్టీ అదినేత అసద్ కు కీడుశంకించింది. బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి అని ప్రపంచానికి తెలిసిపోయింది. బీఆర్ఎస్ తో ముందుకెళితే దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఓటర్లు దూరమవుతారని మజ్లిస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో వెల్లడైంది. దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ గల్లంతవుతుందని మజ్లిస్ ముందే పసిగట్టింది.ఈ కారణంగా మజ్లిస్ బిఆర్ఎస్ ను విమర్శించింది.