మల్లారెడ్డికి టికెట్ కట్?
posted on Jun 5, 2023 4:37PM
బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ అవినీతిపరులకు టికెట్ కట్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ కట్ అయ్యే వారి జాబితాలో మల్లారెడ్డి ముందువరసలో ఉన్నట్లు సమాచారం.
పాలమ్మినా నీళ్లమ్మినా అంటూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన మంత్రి మల్లారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవచ్చని తెలుస్తోంది. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్లు పెద్ద సార్ కు ఉప్పందడం మల్లారెడ్డికి టికెట్ రాకపోవచ్చని బిఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మల్లారెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి టికెట్ దక్కనుందని విశ్వసనీయ వర్గాల భోగట్టా.
మేడ్చెల్ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కల్సి ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు స్థానిక ప్రజలు సైతం మంత్రి మల్లారెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడం లేదు. పార్టీ అధినేత కేసీఆర్ తెప్పించుకున్న రిపోర్టులో మల్లా రెడ్డిపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. మల్లారెడ్డి అనుచరులకే కార్పోరేషన్ చైర్మన్ పదవులు దక్కుతున్నాయని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
మేడ్చెల్ జిల్లా క్యాడర్ బిఆర్ఎస్ కు దూరం కావడం బిఆర్ ఎస్ అధినేతకు కోపం తెప్పించినట్లు సమాచారం. మరో వైపు ప్రజల నుంచి ఫిర్యాదులను కేసీఆర్ పరిగణలోకి తీసుకున్నారు. కెసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మల్లారెడ్డి నాయకత్వాన్ని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి అనుచరురాలు ఏకంగా స్విమ్మింగ్ ఫూల్ కట్టుకోవడం కేసీఆర్ కు రుచించలేదు. చెత్త కుండి స్థలాన్ని సైతం మల్లారెడ్డి వర్గీయులు కాజేసినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవలె కేసీఆర్ బిఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ అని ప్రకటించిన కొద్ది రోజుల్లో మల్లారెడ్డిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. .