డ్రైవర్ లేకుండానే వెనక్కి వెళ్లిన రైలు

 

బంగ్లాదేశ్ లోని రాజ్ బర్హీ రైల్వే స్టేషన్లో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. రైలులో డ్రైవర్, గార్డ్ లేకుండానే రైలు ప్రయాణించింది. అది కూడా ఏకంగా 26 కిలోమీటర్లు, అందులోనూ వెనక్కి ప్రయాణించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయపడ్డారు. రాజ్ బర్హీ నుంచి ఫరీద్ పూర్ కు బయల్దేరిన రైలు ఆరో నెంబరు ఫ్లాట్ ఫాం పై ఆగింది. టీ తాగడానికి డ్రైవర్ ఇంజిన్ ఆపకుండా వెళ్లడంతో, అప్పటికే ఆన్ లో ఉన్న ఇంజిన్ గేర్ మారి వెనక్కి ప్రయాణించడం మొదలుపెట్టింది. ఆసమయంలో రైలులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. సమయానికి హోం గార్డ్ కూడా అందుబాటులో లేడు. దీంతో భయపడిన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపే ప్రయత్నం చేసినా రైలు ఆగలేదు. ఇంతలో టీటీ అన్వర్ హుస్సేన్ రైలులో డ్రైవర్ లేడని గ్రహించి వెంటనే వ్యాక్యూమ్ బాక్స్ నుంచి కీ బాక్స్ ను తొలగించడంతో రైలు ఆగింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్, గార్డులను విధుల నుండి సస్పెండ్ చేశారు.