పొట్టిగా ఉండేవారిలో బట్టతల ఎందుకు?
posted on Jun 29, 2017 10:42AM
మీరో విషయాన్ని గమనించారా! తెల్లగా, పొట్టిగా ఉండేవారిలో బట్టతల కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. కావాలంటే మరోసారి కళ్లుమూసుకుని మీ పరిచయస్తులందరినీ గుర్తుచేసుకుని చూడండి. ఇదేమీ మూఢనమ్మకం కాదండోయ్. జన్యు పరిశోధకులు తేల్చి చెబుతున్న విషయం.
బట్టతల అనేది జన్యుపరంగా వచ్చే సమస్య అని తెలుసు. కానీ బట్టతలని కలిగించే జన్యువులు ఇతరత్రా లక్షణాలు కూడా ఏమన్నా చూపించగలవా? అన్న అనుమానం వచ్చింది కొందరు జర్మనీ శాస్త్రవేత్తలకి. ఆలోచన వచ్చిందే తడవుగా చిన్నవయసులోనే బట్టతల వచ్చేసిన ఓ 11వేల మంది జన్యువులనీ, అసలు బట్టతలే లేని ఓ 12వేల మంది జన్యువులనీ పరిశీలించి చూశారు. వీరంతా కూడా ఒక్కదేశానికి చెందినవారు కాదు. ఏడు వేర్వేరు దేశాలకి చెందిన అభ్యర్థులు!
అభ్యర్థులందరి జన్యువులనీ పరిశీలించిన మీదట... బట్టతల ఉన్నవారిలో ఓ 63 జన్యువులు భిన్నంగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు! ఈ జన్యువుల ఇతరత్రా లక్షణాలకు కూడా కారణం అవుతున్నట్లు బయటపడింది. బట్టతల కలిగించే జన్యువులు... తెల్లటి చర్మానికీ, తక్కువ ఎత్తుకీ, కొన్ని రకాల కేన్సర్లకీ కూడా కారణం అవుతున్నట్లు గమనించారు. ముఖ్యంగా వీరిలో ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గ్రహించారు. అలాగే బట్టతలని కలిగించే జన్యువులతోనే గుండెజబ్బు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే కనిపించింది!
తెల్లటి చర్మం ఉన్నవారిలో బట్టతల రావడానికి కారణం లేకపోలేదు. తెల్లగా ఉన్నవారిలో సూర్యకాంతి నుంచి విటమిన్ ‘డి’ని సంగ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి తల మీద ఉన్న చర్మం కూడా ఆ పని చేసేందుకు వీలుగా, నెత్తిన వెంట్రుకలు పలచబడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తెల్లగా ఉండేవారి బట్టతల ఓ సోలార్ ప్యానెల్లాగా పనిచేస్తుందన్నమాట! కానీ గుండెజబ్బులు, ప్రొస్టేట్ కేన్సర్లాంటి ఇతరత్రా సమస్యలకీ బట్టతలకీ మధ్య కారణం ఏమిటో మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
శతాబ్దాల తరబడి రకరకాల జన్యు పరివర్తనాలు (gene mutations) ఏర్పడటం సహజం. ఈ ప్రక్రియలో భాగంగా కొంతమందికి కొన్ని రకాల జన్యువుల సంక్రమిస్తూ ఉంటాయి. వీటితో కొన్ని లాభాలూ ఉంటాయి, కొన్ని నష్టాలూ ఉంటాయి. నాకు బట్టతల ఉంది కాబట్టి గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ అని బాధపడాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే... ఈ ప్రమాదాన్ని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు.
- నిర్జర.