భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు.. పరార్...

 

వైసీపీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మీద పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు. ఆయన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నించిన పోలీసులకు ఆయన పరారీలో వున్నట్టు తెలిసింది. శుక్రవారం నాడు కర్నూలు జిల్లా నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశం మునిసిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ఫ్లోర్ లీడర్ అనూష గైర్హాజరు కావడంతో ఆమె స్థానంలో మరొకరు కూర్చోవడంతో టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం కౌన్సిలర్ల మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అదే సమావేశంలో వున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఈ హింసాకాండను ప్రేరేపించారని తెలుగుదేశం సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి భూమాను అరెస్టు చేయడానికి వారెంట్ తీసుకొని పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. అయితే ఆయన పరారీలో వున్నట్టు తెలుస్తోంది.