కలాంకు అంత లేదు.. అబ్దుల్‌ ఖదీర్‌ ఖాన్‌

 

సంచలన వ్యాఖ్యలు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని నిన్ననే ఢిల్లీ నుండి రామేశ్వరానికి తరలించారు. అక్కడ ఆయన మృతదేహాన్నిసందర్శనార్ధం ఉంచి ఈ రోజు అంత్యక్రియలు చేయనున్నారు. ఇప్పటికే శాస్త్రవేత్తగానే కాకుండా ప్రజల రాష్ట్రపతిగా ఖ్యాతి గడించిన కలాంను కడసారి చూసేందుకు ఆయన నివాసం వద్ద ప్రజలు బారులు తీరారు. కాగా రాష్ట్రపతి అంత్య క్రియలలో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి బయలుదేరారు.. మరికాసేపట్లో రామేశ్వరం చేరుకోనున్నారు.

 

ఇదిలా ఉండగా కలాం చనిపోయినందుకు ఒక్క భారతదేశంమే కాదు ప్రపంచమంతా ఆయనను.. ఆయన చేసిన సేవలను కొనియాడుతుంటే ఒక వ్యక్తి మాత్రం కలాం ‘ఓ సాధారణ శాస్త్రవేత్త’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను ఎవరంటే పాకిస్థాన్‌ అణుశాస్త్రవేత్త అబ్దుల్‌ ఖదీర్‌ ఖాన్‌. ఈయన బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అత్యున్నతస్థాయిలో ఉన్నా కలాం సాధారణ జీవితం గడిపారు కానీ ఆయన ఓ సాధారణ శాస్త్రవేత్త మాత్రమే’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షిపణి రంగంలో భారత్‌ విజయాలన్నీ రష్యా సహకారంతో సాధించినవే తప్ప అందులో కలాం ప్రతిభ ఏమీ లేదని కొట్టిపారేశారు.