అమరావతిలో కొత్త రాజధాని?
posted on Jul 2, 2014 10:38AM
.png)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మద్య నిర్మింపబడబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా అధికార పార్టీ మంత్రులందరూ ఖరారు చేసారు.దానిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం. వెంకయ్య నాయుడు సైతం ఖరారు చేసారు. కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదన మారినట్లు వార్తలు వస్తున్నాయి. గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతం రాజధాని నిర్మాణానికి చాలా అనువుగా ఉన్నప్పటికీ అక్కడ సారవంతమయిన వ్యవసాయ భూములపై రాజధాని నిర్మించడం సబబు కాదని ప్రభుత్వం భావిస్తోంది. అదీగాక అక్కడ ప్రభుత్వ భూములు తక్కువగా ఉన్నందున తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించి ప్రైవేటు భూములను కొనవలసి ఉంటుంది. ఈ రెండు కారణాల వలన రాజధానిని విజయవాడ-గుంటూరు సమీపంలోనే వేరే ప్రాంతంలో నిర్మించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లాలో అమరావతి వద్ద లేదా ఏలూరు-విజయవాడ మధ్య హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు రూటులో బలుపులపాడు వద్దగానీ కొత్త రాజధాని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా సమాచారం.
అమరావతి వద్ద రాజధాని నిర్మాణం కోసం దాదాపు 15000 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్దంగా ఉంది. కనుక ప్రభుత్వం భూమి కొనుగోలుపై డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. కృష్ణానదికి ఇరువైపులా వ్యాపించి ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలలో కొన్ని మండలాలను కలిపేందుకు గుంటూరులో అచ్చంపేట మండలం నుండి కృష్ణా జిల్లాలో నందిగామ వరకు ఎనిమిది లైన్ల బ్రిడ్జిని, కృష్ణా జిల్లాలో కంచికర్ల నుండి అమరావతి వరకు మరొక బ్రిడ్జి కూడా నిర్మించినట్లయితే అమరావతిలో నిర్మింపబడే కొత్త రాజధానితో ఆ రెండు జిల్లాలలో అన్ని ప్రాంతాలు పూర్తిగా అనుసంధానమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఇక ప్రభుత్వ పరిశీలనలో ఉన్న మరో ప్రాంతం నూజివీడు వద్దగల బలుపులపాడు అటవీ ప్రాంతం. ఇక్కడ కూడా అటవీ శాఖకు చెందిన 15, 000 ఎకరాల స్థలం ఉంది. ఈ ప్రాంతాన్ని డీ-నోటిఫై చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేప్పట్టినట్లు తెలుస్తోంది.
ఈ రెండు ప్రాంతాలలో ఏదో ఒక ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేసి రెండవ ప్రాంతంలో ఉన్నత విద్యా, వైద్య సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు ప్రభుత్వం తరపున అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు కనుక ఇంకా విజయవాడ-గుంటూరు మధ్య గల ప్రాంతం కూడా రాజధాని కోసం పరిశీలనలో ఉన్నట్లే భావించవలసి ఉంటుంది. బహుశః ఈ నెలాఖరులోగా కొత్త రాజధానిని ఎక్కడ నిర్మిస్తారనే విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.