కమలనాధన్ కమిటీతో ఉద్యోగుల సమస్యలు తీరేనా?

 

ఇంతకాలంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కోసం పనిచేసిన ప్రభుత్వోద్యోగులను రాష్ట్రవిభజన కారణంగా రెండు రాష్ట్రాలకు పంచవలసివచ్చింది. ఈ సంక్లిష్టమయిన ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తికాక మునుపే రాష్ట్ర విభజన జరిగిపోయింది. రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అందువల్ల ఉద్యోగులు ఎవరు ఏ రాష్ట్ర ప్రభుత్వం క్రింద పనిచేయాలనే సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గత యూపీఏ ప్రభుత్వం నియమించిన కమలనాధన్ కమిటీ నిన్న సచివాలయంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో, ఉద్యోగ సంఘ నేతలతో సమావేశమయింది. ఉద్యోగులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం క్రింద పనిచేయాలో ఎంచుకొనే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.

 

ఆంద్ర ఉద్యోగులకు ఆప్షన్స్ ఉండవని, వారు తప్పనిసరిగా వెళ్లిపోవలసిందేనని, తెలంగాణా సచివాలయంలో కల్తీ ఉండొద్దు, ఆంద్ర ఉద్యోగులను లోనికి రానిచ్చే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తెగేసి చెపుతున్నపుడు, కమలనాధన్ కమిటీ ఉద్యోగులకు ఆప్షన్ ఉంటాయని చెప్పడంతో ఈ సమస్య మరింత జటిలమయింది. ఆంద్రప్రాంతానికి చెందిన ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయాలనే ఆప్షన్ కోరుకొంటే ఏమవుతుంది? ఆంద్ర విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించేందుకే ఇష్టపడని కేసీఆర్, ఇప్పుడు వందల కొద్ది ఆంధ్ర ఉద్యోగులు తన ప్రభుత్వంలో పనిచేసేందుకు ఆప్షన్ ఎంచుకొని, పదవీ విరమణ చేసినట్లయితే వారందరికీ జీవితాంతం పెన్షన్ తదితర సదుపాయాలూ ఇచ్చేందుకు అంగీకరిస్తారని ఏవిధంగా భావించగలము? అప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు కమలనాధన్ కమిటీ వద్ద సమాధానం లేదు.

 

ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వడం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినట్లేనని భావిస్తున్న కమలనాధన్ కమిటీ నేడు కేంద్ర ప్రభుత్వానికి తన నివేదిక ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇటువంటి సమస్యలకు పరిష్కారం చెప్పకుండా ఉద్యోగులను విభజిస్తే వందలాది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది. అనేక సం.లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సేవ చేస్తున్న ఉద్యోగులు ఇపుడు అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణాకు కూడా కాని వారిగా మిగిలిపోయేలా ఉన్నారు. అందుకే సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 

అయితే ఈ జతిలమయిన సమస్యలకు పరిష్కారం ఏమిటి? ఎవరు చెపుతారు? అని ప్రశ్నించుకొంటే ఈ సమస్యను ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలే చొరవ తీసుకొని పరిష్కరించుకోవలసి ఉంటుందని గ్రహించవచ్చును. కమలనాధన్ కమిటీ కేవలం పరిష్కార మార్గాలను మాత్రమే చెప్పగలదు. కానీ సమస్యలను పరిష్కరించుకొనే బాధ్యత మాత్రం ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలపైనే ఉంది. ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొంటూ మానవీయ దృక్పధంతో ప్రయత్నిస్తే తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చును. రాష్ట్ర విభజన కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమవుతున్న ఇటువంటి అనేక సమస్యలను పరిష్కరించుకొనేందుకు రెండు ప్రభుత్వాలు తాత్కాలిక నివారణోపాయలు చేయకుండా, రానున్న ఐదేళ్ళ కాలం కోసం ఇరు రాష్ట్రాలకు చెందిన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసుకొంటే మంచిది.