మంత్రి ట్విస్ట్.. చంద్రబాబుకు తెలియకుండా ఇచ్చాం



 

ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజధాని పరిధిలో ఐదు గ్రామాలకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ భూసేకరణ వ్యవహారంపై రైతుల దగ్గర నుండి భూములు లాక్కోవద్దు.. వారు అంగీకరించి భూములు ఇస్తేనే తీసుకోండని లేని పక్షంలో ఏపీ ప్రభుత్వంపై పోరాడటానికైనా సిద్ధమని హెచ్చరించారు. మరోవైపు ప్రతి పక్షనేత జగన్ కూడా భూసేకరణ పై ధర్నా చేశారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈవ్యవహారంపై మంత్రి నారాయణ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ భూసేకరణ బిల్లు విషయం చంద్రబాబుకు తెలియదని.. చంద్రబాబు దృష్టికి తీసుకురాకుండానే భూసేకరణ బిల్లు ఇచ్చామని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. భూసేకరణ బిల్లుకు చంద్రబాబు మొదటి నుండి వ్యతిరేకమే అని కానీ రాజధాని నిర్మాణానికి సమయం దగ్గర పడుతుండటంతో తానే నోటిఫికేషన్ జారీ చేయించానని చెప్పారు. ఇప్పుడు ఈ బిల్లును తాము వెనక్కి తీసుకుంటున్నామని.. చంద్రబాబు.. అలాగే భూసేకరణ పై పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతులను ఒప్పించే భూసేకరణ చేస్తామని.. ఎవరినీ బలవంతం పెట్టబోమని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.