ప్రత్యేక హోదా గురించి త్వరగా ఆలోచించండి.. వెంకయ్య

 

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏపీ ప్రత్యేక హోదా విషయంపై నీతి ఆయోగ్‌ అధికారులతో భేటీ అయ్యారు. ఈరోజు వెంకయ్యనాయుడి నివాసంలో గంటకు పైన వీరితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని త్వరగా పరిశీలించాలని ఆయన వారికి సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో జరిగిన చర్చలు గురించి.. రాష్ట్ర విభజన వల్ల రాజధాని లేక.. ఆర్ధిక లోటుతో ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలగురించి వెంకయ్య వారికి వివరించినట్టు సమాచారం. ప్రత్యేక హోదాతోపాటు ప్యాకేజీపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అదనంగా ఆర్థిక చేయూత అందజేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సరిపోయినన్ని నిధులు ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగరియా, సభ్యులు వివేక్‌ డెబ్రాయ్‌, సీఈవో సింధుశ్రీ కుల్లార్‌ పాల్గొన్నారు.