విజయవాడకు ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా?
posted on Jul 29, 2015 11:30AM
రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు, ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే ఏడాది గడిచిపోయింది. కానీ నేటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన హైదరాబాద్ నుండే కొనసాగుతోంది. మరొక తొమ్మిదేళ్ళవరకు కూడా అక్కడి నుండే పరిపాలించుకొనే వెసులుబాటుంది. కానీ దాని వలన ఊహించని అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. రాష్ట్రం ఒకచోట...పరిపాలనా కేంద్రం మరొక చోట ఉన్నందున ప్రభుత్వానికి వ్యయప్రయాసలే కాకుండా పరిపాలనపై కూడా ఆ దుష్ప్రభావం పడుతోంది.
గోదావరి పుష్కరాల సమయంలో ఈ లోపం చాలా స్పష్టంగా కనబడింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కారాలలో కలియతిరుగుతూ పనులను చక్కబెట్టవలసి వచ్చింది. అదే ఉద్యోగులు, అధికారులు అందరూ విజయవాడకి తరలి వచ్చి ఉండి ఉంటే గోదావరి పుష్కరాలు మరింత అద్భుతంగా నిర్వహించి ఉండేవారేమో?
రాష్ట్రప్రభుత్వం త్వరలోనే రాజధాని అమరావతి నిర్మాణం కూడా మొదలుపెట్టాలని భావిస్తునందున, ఆ పనులను సంబందిత అధికారులు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ వారందరూ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నందున, అప్పుడప్పుడు వచ్చిపోగలరు. ఇంత భారీ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఉద్యోగుల పాత్ర, అధికారుల పర్యవేక్షణ చాలా అవసరం ఉంటుంది. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై మొదటి నుండే సరయిన పర్యవేక్షణ లేకపోతే ఆనక ప్రజలు, ప్రతిపక్షాల నుండి రాష్ట్రప్రభుత్వమే విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది.
బహుశః అందుకే పంచాయితీ రాజ్, రోడ్లు భవనాలు, రెవెన్యూ, విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఆర్ధిక, కార్మిక శాఖలకు చెందిన అన్ని విభాగాలను వీలయినంత త్వరగా విజయవాడకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకోసం ఐదుగురు ఐ.ఏ.యస్. అధికారులతో కూడిన ఒక కమిటినీ నియమించారు. ఆ కమిటీలో శ్యాం బాబ్, లవ్ అగర్వాల్,జవహార్ రెడ్డి, హేమ ముని వెంకటప్ప, జయలక్ష్మి సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ నుండి ప్రభుత్వ కార్యాలయాను, వాటితో బాటే ఉద్యోగులను, ఉన్నతాధికారులను తరలించేందుకు అవసరమయిన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆ కమిటీని ఆదేశించారు. విజయవాడ, గుంటూరు, సి.ఆర్.డి.ఏ. పరిధిలో ఉన్న రాజధాని ప్రాంతాలలో భవనసముదాయాలను, ఇళ్ళను అద్దెకు తీసుకొని వాటిలో ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు, ఉన్నతాధికారులకు నివాసాలను ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. కానీ ఇంతకు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ శాఖలను, ఉద్యోగులను విజయవాడకు తరలించేందుకు ప్రయత్నించి విఫలమయింది. కారణాలు అందరికీ తెలిసినవే. కనుక మళ్ళీ ఇప్పుడు అదే సమస్య ఎదురవవచ్చును.
కనుక ప్రభుత్వం ముందుగా ఉద్యోగ సంఘాలనేతలతో, ఉన్నతాధికారులతో చర్చించి అడుగు ముందుకు వేస్తే మంచిది. లేకుంటే మళ్ళీ వారు నిరాకరిస్తే అది వారికీ, ప్రభుత్వానికీ కూడా గౌరవప్రదంగా ఉండదు. హైదరాబాద్ నుండి ఒకేసారి సుమారు 30-40వేల మంది ఉద్యోగులను, డజన్ల కొద్దీ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించే ముందు అక్కడ అవసరమయిన ఇళ్ళు, భవన సముదాయాలు అద్దెకు దొరుకుతాయా లేదా? ఒకవేళ దొరికినా ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నిటికీ ప్రభుత్వం అద్దెలు చెల్లించగలదా లేదా? ఆ ఆర్దికభారాన్ని ఎంతకాలం భరించగలదు? వంటి అనేక సందేహాలను నివృత్తి చేసుకొన్నాక రంగంలోకి దిగితే మంచేదేమో? ఆలోచించాలి.