చంద్రబాబు దృష్టి దానిపైనేనా
posted on Jul 30, 2015 6:41PM
ఏపీ రాజధాని నిర్మాణం ఇది ఇప్పుడు సీఎం చంద్రబాబునాయుడికి చాలా ముఖ్యమైన ఘట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏపీ ప్రజలందరి ఆశ రాజధానిపైనే ఉంది. మరి అలాంటి రాజధానిని నిర్మించి.. ప్రజలలో తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొవాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పనో అర్ధమైన విషయమే. అంటే ఇప్పటికిప్పుడు ఏపీ రాజధాని నిర్మాణం అంటే అది అసాధ్యమైనదే కానీ.. దీనిని దశల వారీగా దానిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే 2018 వరకూ మొదటి దశ పూర్తి చేయాలని.. రెండోదశను 2035 వరకూ పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇందుకు తగ్గట్టుగానే సింగపూర్ బృందం ప్లానింగ్ చేసింది.
మరోవైపు ఈ ఏపీ రాజధాని అమరావతి మొదటి దశ 2018 వరకూ పూర్తి చేయాలి అనుకోవడంలో కూడా ఒక కారణం ఉందని అనుకుంటున్నారు రాజకీయ వర్గాలు. 2019 లో జరగబోయే ఎన్నికలను దష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఈనిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఏపీ మంత్రులతో భేటీ కూడా ఏర్పాటుచేసి ఎలాగైనా 2018 లోపు ఏపీ రాజధానిలో కొంత వరకైనా నిర్మాణం జరగాలని సూచించారట. ఈ మొదటి దశలో కనీసం 45, 50 అంతస్తులు కలిగిన రెండు ఆకాశ హర్మ్యాలు.. మంత్రులకు గాను.. వారి విధులు నిర్వహించడానికి కావల్సిన కార్యలయాలకుగాను.. ప్రభుత్వ కార్యలయాలకు సంబంధించి భవంతులను నిర్మించాలని భావిస్తున్నారట. ఇప్పటికే నెలరోజుల్లో తాత్కాలిక రాజధాని నిర్మించి.. హైదరాబాద్ లో ఉన్న కొన్నిశాఖలను విజయవాడకు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి చంద్రబాబు ఏపీ రాజధాని నిర్మాణానికి గట్టి పట్టుదలతోనే ఉన్నట్టు తెలుస్తోంది. నిజంగానే ఆయన అనుకున్నట్టు 2018 వరకూ తను అనుకున్నట్టు రాజధానిని నిర్మించినట్టుయితే రాబోయే ఎన్నికల్లో తనే మళ్లీ అధికారంలోకి రావచ్చు అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.