11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 11న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అదే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే ఈ సమావేశాలలో ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశ పెట్టనుంది. 

అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా పూర్తిస్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టడం లేదు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదు అంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న  విమర్శలకు చంద్రబాబు సర్కార్ చెక్ పెట్టనుంది ఇప్పటికే   బడ్జెట్‌ రూపకల్పన పూర్తయ్యింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌  బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఆ మేరకు ఆదాయం సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తైంది. ప్రజలపై భారం మోపకుండా ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. గత వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2,86,389 కోట్లకు బడ్జెట్‌ సమర్పించారు.  2024 ఏప్రిల్‌ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి మొత్తం 40 గ్రాంట్ల కింద రూ. 1,09,052.34 కోట్లకు గత ప్రభుత్వం శాసనసభ ఆమోదం తీసుకుంది. ఆ తరువాత ఎన్నికలలో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి జూన్ నెలలో అధికార పగ్గాలను చేపట్టింది.  

ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా ఉండటంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జులైలో మరోసారి ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ కు ఆమోదం తీసుకుని,  ఆగస్టు మూడు నుంచి నవంబర్ వరకూ నాలుగు నెలల కాలానికి  రూ.1,29,972.97 కోట్లతో 40 గ్రాంట్ల కింద రెండో తాత్కాలిక బడ్జెట్‌కు గవర్నర్‌ఆమోదం పొందింది. ఈ నెలతో ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ 11వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.