విశాఖలో అక్షరధామ్ ఆలయం!?

 

అక్షర్‌ధామ్ ఆలయాల గురించి, ఆ ఆలయాల అందం గురించి, ఆ ఆలయాల వైభవం గురించి అందరికీ తెలిసిందే. శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థానం ట్రస్ట్ ఈ ఆలయాలను నిర్మించింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో, దేశ రాజధాని ఢిల్లీలో అక్షర్‌ధామ్ ఆలయాలు వున్నాయి. ఈ ఆలయాలు ఒకే తరహాలో వుంటాయి. వీటిని చూడటానికి రెండు కళ్ళూ చాలవన్నట్టుగా వుంటాయి. ఈ ఆలయాలను దర్శించడానికి భారీ సంఖ్యలో యాత్రికులు వస్తూవుంటారు. హిందూ ధర్మ వైభవానికి ప్రతీకలుగా నిలిచే ఆలయాలివి. ఇప్పుడు ఇలాంటి అక్షర్‌ధామ్ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో కూడా ఏర్పాటు చేయాలని శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థానం ట్రస్ట్ భావిస్తోంది. వైజాగ్‌లో ఆలయాన్ని నిర్మించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విశాఖపట్టణం సమీపంలోని సింహాచలం పరిసరాల్లో ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిని గుర్తించే పనుల్లో వున్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థానం ట్రస్ట్ వైజాగ్ సమీపంలో అక్షరధామ్ ఆలయాన్ని నిర్మించాన్న ప్రతిపాదనను సూత్రప్రాయంగా తమ దగ్గర వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా అందుకు పూర్తి సుముఖంగానే వుందని, స్వామినారాయణ్ ట్రస్ట్ నుంచి పూర్తి సమాచారం వచ్చిన అనంతరం, ప్రభుత్వం కూడా ఈ దిశగా మరింత ముందడుగు వేస్తుందని ఆయన తెలిపారు. విశాఖపట్నం పరిసరాలను టూరిస్ట్ ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికలను రూపొందిస్తోందని, ఇప్పుడు ఈ ప్రాంతంలో అక్షరధామ్ ఆలయ నిర్మాణం జరిగితే, విశాఖ ప్రాంతం జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను మరింతగా ఆకర్షించే అవకాశం వుందని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక సంస్థలు వస్తున్నాయి.  ఇక అక్షరధామ్ ఆలయ నిర్మాణం కూడా జరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది మరో ముందడుగు అవడం ఖాయం.