ప్రత్యేకహోదా రాష్ట్రం కోసమా లేక రాజకీయ పార్టీల కోసమా?

 

రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చే విషయం గురించి కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ నిన్న లోక్ సభలో చెప్పిన సమాధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కలకలం సృష్టించింది. “ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే ఆలోచన కేంద్రానికి లేదు. అటువంటి ప్రతిపాదనలేవీ మా పరిశీలనలో లేవు. అందుకు ఎటువంటి విధానమూ కూడా లేదు,” అని కుండ బ్రద్దలు కొట్టినట్లుగా ఆయన ప్రకటించారు.

 

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు ఇదివరకు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు రెండూ కూడా అంగీకరించినప్పటికీ, ఇప్పటికే అందరికీ తెలిసిన కొన్ని కారణాల వలన ఇవ్వడం సాధ్యం కావడం లేదు. అదే మాట కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కొన్ని నెలల క్రితం చెప్పినప్పుడు అందరూ ఆయనపై విరుచుకుపడ్డారు. అప్పటి నుండి ఈ ప్రత్యేకహోదా అనేది ప్రజలకు, రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అంశంగా కాక, ప్రతిపక్ష పార్టీలకి అధికార తెదేపా, బీజేపీలపై ప్రయోగించేందుకు ఒక మంచి అస్త్రంగానే ఎక్కువ ఉపయోగపడుతోందనే చేదు నిజం ప్రజలు కూడా గ్రహించే ఉంటారు.

 

ఈ రాజకీయాల సంగతి ఎలా ఉన్నా, తెదేపా మంత్రులు కేంద్రంపై నిరంతరంగా దీనికోసం ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. తమ ప్రయత్నాలు కొంత వరకు ఫలించాయని, త్వరలోనే కేంద్రం దీనిపై ఒక ప్రకటన చేస్తుందని కేంద్రమంత్రి సుజానా చౌదరి ప్రకటించారు. కానీ ఊహించని విధంగా, ఇంద్రజిత్ సింగ్ లోక్ సభలో నిన్న ఈ ప్రకటన చేయడంతో రాష్ట్రంలో తెదేపా, బీజేపీలు రెండూ కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసివస్తోంది. కానీ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడే హామీ ఇచ్చి ఉన్నందున, ఇంద్రజిత్ సింగ్ నిన్న లోక్ సభలో చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించకపోవచ్చును. కనుక దీని తెదేపా ఎంపీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు దీనిపై త్వరలోనే కేంద్రం చేతనే వివరణ ఇప్పించవచ్చును. అప్పుడు కూడా కేంద్రం ఇంద్రజిత్ సింగ్ చెప్పినదానికే కట్టుబడి ఉంటే ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే భావించవచ్చును.

 

కానీ ఈ అంశాన్ని ఉపయోగించుకొని ప్రతిపక్షాలు చేస్తున్న హడావుడి దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకహోదా అంశాన్ని రాజకీయ పార్టీల చేతిలో పెట్టి వాటికి రాజకీయ లబ్ది కలిగించాలా లేక ప్రత్యేకహోదాకి సమానంగా కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తానంటున్న ప్రత్యేక ప్యాకేజీని స్వీకరించడం మంచిదా? అని ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది.

 

ప్రజలు గమనించాల్సిన మరొక్క విషయం ఏమిటంటే ఒకవేళ రాష్ట్రానికి ఈ ప్రత్యేకహోదా మంజూరు చేసినా అది యావత్ రాష్ట్రానికి వర్తించదని ఇదివరకు యూపీఏ ప్రభుత్వమే తేల్చిచెప్పింది. రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంద్రా జిల్లాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అదికూడా పారిశ్రామిక అభివృద్ధి కోసమే ఉద్దేశించబడింది తప్ప అన్ని పనులకు భారీగా నిధులు మంజూరు చేసేందుకు కాదు. ఈ విషయం గురించి చెప్పకుండా ‘రాష్ట్రమంతటికీ ప్రత్యేకహోదా వస్తుంది...ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి నిధుల వరద మొదలయిపోతుంది’ అన్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నాయి.

 

ఈ విషయాల గురించి తెదేపా, బీజేపీలు ప్రజలకు వివరించడంలో అశ్రద్ధ చేసినందునే ఈ సమస్య మరింత తీవ్రం అయిందని చెప్పవచ్చును. ఇప్పటికే 14నెలలు పూర్తయిపోయాయి. కానీ ప్రత్యేకహోదా రాలేదు. ఇంకా ఎప్పటికి వస్తుందో తెలియదు. కారణాలు అందరికీ తెలిసినవే. అటువంటప్పుడు పుణ్యకాలం పూర్తికాక ముందే అందుబాటులో ఉన్న అవకాశాలని ఉపయోగించుకొని రాష్ట్రాభివృద్ధి చేసుకోవడం మంచిదా? లేక ఇంకా ఈ భ్రమలలోనే జీవిస్తూ రాజకీయ పార్టీలకి లబ్ది కలిగించేందుకు పోరాటాలు కొనసాగించడం మంచిదా? అని ప్రజలు కూడా ఆలోచించుకోవాలి.

 

మరొక్క ఏడాదో రెండేళ్ళ తరువాతనో రాష్ట్రానికి ప్రత్యేకహోదా వచ్చినా అప్పటి వరకు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడుతుంది. పారిశ్రామిక అభివృద్ధి జరగకపోతే రాష్ట్ర ఆర్ధికపరిస్థితి కూడా మారదు. కనుక తెదేపా, బీజేపీలు కూడా ఈ ప్రత్యేకహోదా అంశాన్ని ఇంకా నాన్చకుండా అది సాధ్యమో కాదో విస్పష్టంగా ప్రకటించి, వీలుకాకపోతే ప్రత్యామ్నాయంగా రాష్ట్రాని మంచి ఆర్ధిక ప్యాకీజీ సాధించే ప్రయత్నాలు చేయడం మంచిది. తద్వారా ఆ రెండు పార్టీలు విమర్శలను ఎదుర్కొనే బాదా తప్పుతుంది, రాష్ట్రానికి ఇంకా నష్టం జరుగకుండా నివారించవచ్చును కూడా. ఈ అంశంలో తెదేపా, బీజేపీలు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ముందుకు సాగినట్లయితే ప్రతిపక్షాలు కూడా చల్లబడే అవకాశం ఉంటుంది.