అంతర్ రాష్ట్ర వివాదాలలో ఉద్యోగులు బలవుతున్నారా?

 

గత ఏడాది కాలంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న అనేక వివాదాస్పద నిర్ణయాలను, జి.ఓ.లను కోర్టులు పదేపదే తప్పుపడుతున్నప్పటికీ ప్రభుత్వం మళ్ళీ అటువంటి అవమానకరమయిన పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడలేదు. పైగా మళ్ళీ మళ్ళీ అటువంటి పరిస్థితే కోరి తెచ్చుకొంటోంది. తెలంగాణా ట్రాన్స్ కో, తెలంగాణా జెన్ కో, తెలంగాణా విద్యుత్ పంపిణీ వ్యవస్థలలో పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంతాలకి చెందిన 1250 మంది ఉద్యోగులనుక్రిందటి నెల 3వ తేదీన విధులలో నుండి తప్పించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఉద్యోగులు అందరూ హైకోర్టులో ఒక పిటిషన్ వేసారు. దానిపై స్పందించిన హైకోర్టు తొలగించిన ఉద్యోగులందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణా విద్యుత్ సంస్థలను ఆదేశించింది.

 

దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పిర్యాదు చేసింది. కేవలం ఆంధ్రా ప్రాంతానికి చెందినవారనే కారణంతో ఉద్యోగులను బయటకి పంపడం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్దంగా ఉందని కనుక తక్షణమే ఆ ఉద్యోగులు అందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని, మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా కేంద్రప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దాని వాదనతో ఏకీభవించిన కేంద్రప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి యదాతధ స్థితి కొనసాగించమని ఆదేశిస్తూ లేఖలు వ్రాసింది. ఆ లేఖలో కేంద్ర హోంశాఖ డైరెక్టర్ అశుతోష్ జైన్ ఈ సమస్యని పరిష్కరించేందుకు మూడు ప్రతిపాదనలు చేసారు.

 

1. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకొని ఉద్యోగుల విభజన ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలి. 2. లేదా దీని కోసమే కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమలనాధన్ కమిటీ సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన చేసుకోవాలి. ఈ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్ళీ వివాదాలు తలెత్తినట్లయితే కమల్ నాధన్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. 3. పై రెండు ప్రతిపాదనలు సాధ్యం కాకపోతే కేంద్రప్రభుత్వమే జోక్యం చేసుకొని ఉద్యోగుల విభజన ప్రక్రియను మళ్ళీ కమల్ నాధన్ కమిటీ లేదా షీలా బిడే కమిటీకిగానీ అప్పగిస్తుంది. ఈ మూడు ప్రతిపాదనలపై ఇరు రాష్ట్రాలు శనివారంలోగా తమ అభిప్రాయాలు తెలపాలని కేంద్రహోం శాఖ డైరెక్టర్ అశుతోష్ జైన్ ఆదేశించారు.

 

స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలనే తెలంగాణా ప్రభుత్వ వాదన సమంజసంగానే ఉన్నప్పటికీ, గత మూడు నాలుగు దశాబ్దాలుగా తెలంగాణాలోనే స్థిరపడి, అక్కడి ప్రభుత్వ శాఖలలోనే పనిచేస్తున్న ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను, వారి ఆంధ్రా మూలాల కారణంగానే తొలగించాలనుకోవడం సమంజసం కాదని కోర్టులు కూడా అభిప్రాయమ వ్యక్తం చేసాయి. కానీ తెలంగాణా ప్రభుత్వం కోర్టుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతుండటంతో ఈ సమస్య పునరావృతం అవుతోంది. ఇటీవల షెడ్యూల్:10 క్రింద వచ్చే సంస్థలన్నిటినీ కూడా ఏకపక్షంగా స్వాధీనం చేసుకొన్న తెలంగాణా ప్రభుత్వం వాటిల్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో తెలంగాణాకు చెందిన ఉద్యోగులను నియమించాలని ఆదేశించింది. బహుశః మున్ముందు ఇటువంటి సమస్యలు తలెత్తుతూనే ఉండవచ్చును.

 

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని కేవలం ఒక సమస్యగానో లేక వివాదంగానో రాజకీయకోణంలో నుండి చూస్తున్నాయి. కానీ ఇది వేలాది మంది ఉద్యోగుల, వారిపై ఆధారపడిన కుటుంబాలకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే జీవన్మరణ సమస్య ఇది. కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, కమిటీలు, ఉద్యోగ సంఘాలు అందరూ కలిసి ఈ సమస్యను వీలయినంత త్వరగా ఉద్యోగులకు ఏ మాత్రం నష్టం జరగకుండా పరిష్కరించవలసిన బాధ్యత ఉంది.