తక్కువ తింటే వయసు తగ్గిపోతుంది

 

అసలే మనం తింటున్న ఆహారం, పీలుస్తున్న గాలి విషమయం. వీటికి తోడు నరాలు చిట్లిపోయేంత ఒత్తిడి. సహజంగానే ఈ ప్రభావమంతా శరీరం మీద పడుతుంది. నలభై ఏళ్లకే అరవై ఏళ్ల వచ్చేసినట్లుగా కనిపిస్తుంది. కాస్త డబ్బున్నవారు, ఆకర్షణీయంగా కనిపించాలన్న తపన ఉన్నవారు బొటాక్స్ ఇంజక్షన్లూ, యాంటీ ఏజింగ్ క్రీములూ వాడేస్తుంటారు. కానీ అంత కష్టపడనవసరం లేకుండానే యవ్వనాన్ని కాపాడుకునే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.

 

అవే పోషకాలు – తక్కువ కేలొరీలు

 

అమెరికాలోని Brigham Young Universityకి చెందిన పరిశోధకులు... ఆహారానికీ, వయసుకీ మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. దీనికోసం వారు ఎలుకల మీద ఓ ప్రయోగం చేశారు. వాటిలో కొన్నింటికి సాధారణంగానే ఆహారాన్ని అందిస్తూ, మరికొన్ని ఎలుకలకు మాత్రం తక్కువ కేలరీలను అందించే ఆహారాన్ని అందించారు. కేలరీలను అందించడంలో ఎక్కువ తక్కువలు ఉన్నా, పోషకాల విషయంలో మాత్రం ఎలాంటి తేడా లేకుండా చూసుకున్నారు.

 

రైబోజోమ్స్

 

మన కణాలలో రైబోజోమ్స్ అనే విభాగం ఉంటుంది. కణాలకు అవసరమయ్యే ప్రొటీన్లను ఉత్పత్తి చేయడంలో వీటిది కీలక పాత్ర. తక్కువ ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ రైబోజోమ్స్ నిదానించాయట. ఇలా రైబోజోమ్స్ ఉత్పత్తి నిదానించినప్పటికీ, వాటి పనితీరు మెరుగుపడటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది.రైబోజోమ్స్ నిదానించడం వల్ల అవి వీలైనంత శక్తిని పుంజుకునే సమయం లభించడమే దీనికి కారణం అని తేల్చారు.

 

రోగాలు దూరం

 

కేలరీలు తక్కువ తీసుకోవడం వల్ల రైబోజోమ్స్ తీరులో మార్పు వచ్చిందని రుజువైపోయింది. దీని వలన ఎలుకల ఆరోగ్యంలో కూడా తేడా కనిపించింది. అవి ఎక్కువ చురుగ్గానూ, ఎలాంటి రోగాలు లేకుండానూ జీవించాయి. రైబోజోమ్స్లోని ఈ మార్పు శరీరం మొత్తం మీదా కనిపించింది. ‘రైబోజోమ్స్ అనేవి కారు టైర్లలాంటి. టైర్లు కారులో ఓ చిన్న భాగమే కదా అనుకోవడానికి లేదు. అవి లేకపోతే అసలు కారు పనితీరే మారిపోతుంది. అలాగే రైబోజోమ్స్ కూడా సమర్థవంతంగా పనిచేస్తే జీవితకాలం మెరుగుపడుతుంది,’ అంటున్నారు పరిశోధకులు.

 

వయసుకి సంబంధించిన పరిశోధనల్లో ఇది చాలా కీలకమైన పరిశీలనగా భావిస్తున్నారు. మనం తినే ఆహారం శరీరం మీద ఎలా పనిచేస్తుంది? అది వయసు మీద ఎలా ప్రభావం చూపుతుంది? అని తెలుసుకునేలా మరిన్ని పరిశోధనలు చేసేందుకు దీనిని తొలిఅడుగుగా భావిస్తున్నారు. అప్పటివరకూ తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలూ ఉండే ఆహారాన్ని తీసుకోమంటూ సిఫారసు చేస్తున్నారు.

- నిర్జర.