రాష్ట్ర నాయకుల "రహస్య లిపి''

 

 

 

- డా. ఎబికె ప్రసాద్

 

[సీనియర్ సంపాదకులు]
 

 

 

కవి శ్రీరంగం నారాయణ బాబు అనేక సంవత్సరాల క్రితం ఓ పాట రాశాడు. రంగూన్ (బర్మా)తో వర్తక, వ్యాపార లావాదేవీలు మన రేవు పట్టణాలనుంచి జరుగుతున్నప్పుడు ఓ జానపద దంపతుల జంట మధ్య నడిచిన సంభాషణకు అక్షర రూపమిచ్చాడు :

"రంగమెళితే నేటి రంగైనవోడ!  నే
     రంగమెళితే నేటి అచ్చరాల నీ పేరే పచ్చాపొడుసుకొన్నాను
    సాటుమాటుగ దాన్ని సదివించుకొన్నాను  రంగమెళితే నేటి? ...''

ఇక్కడ 'రంగం' అంటే రంగూన్ అనే. ఎవడిగోలవాడిదే అన్నట్టుగా తొలి రోజుల్లో మన కవిత్వం మనమేగాని యితరులకు తెలియకుండా వుండాలనే ఊహ ఉండేది మన కవులకు! ఈ దుస్థితిని కనిపెట్టి తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు అలాంటి "దుస్థితి''ని "రంగూను ఉత్తరాల''తో పోల్చుతూ వుండేవారు! ఇంతకీ ఈ "రంగూన్ ఉత్తరాల'' కథాకమామీషు ఏమిటి?! ఆనాటి ఆంధ్రదేశంలో శ్రీకాకుళం నుండి గోదావరి జిల్లాల వరకూ ఒకప్పుడు రంగూన్ తో భారీస్థాయిలో వ్యాపార లావాదేవీలు జరుగుతుండేవి. మొగలాయీలు, నిజాంపాలకులు కూడా తెలంగాణా తెలుగుప్రాంతంలో సముద్రప్రాంతం లేనందున మచిలీపట్నం, కాకినాడ రేవుల నుంచే వర్తక, వ్యాపారాలు నిర్వహించుకునే వారు!


నాటి వర్తక వ్యాపారానికి సంబంధించిన పరస్పర ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ రహస్య (సంకేత) లిపిలో సాగుతుండేవట. ఆ 'లిపి' చాలావరకు తెలుగు, ఉర్దూలే అయినప్పటికీ ఆ లిపిని అటు ఇటూ కూడా ఉత్తరాలు పంపేవారికి, అందుకునేవారికి మాత్రమే అర్థం చేసుకోగలిగేవాళ్ళట. అంటే, వ్యాపార రహస్యాలు వెల్లడి కాకుండా ఈ ప్రత్యేక 'లిపి' వాడేవారట! చాలామందికి గుర్తుందో లేదో మన చిన్నప్పుడు ఆట పాటల్లో ఉన్న పిల్లలు పెక్కుమంది 'క' భాషలో (సంకేత భాష) ఇతరులకు తెలియకుండా వాడుతూ వుండేవారు సరదాగా! కాని ఇప్పుడు అలాంటి భాష ఏదో రాష్ట్ర విభజన సమస్యపైన అటు కేంద్ర నాయకులకూ, ఇటు దశదిశా తెలియకుండా ప్రజల్ని సొంత ఎజెండాలతో వేధిస్తున్న పార్లమెంటు సభ్యులకు, శాసనసభ సభ్యులకూ, "సొంత పార్టీలు'' పెట్టుకుని యుతవలో, ప్రజలలో భ్రమలు గొలిపే రాజకీయ నాయకులకూ మధ్య "ఆసులో గొట్టాం''లా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ జరుపుతున్న "రాజకీయ వ్యాపార లావాదేవీలు'' కూడా "రంగూన్'' ఉత్తరాల మాదిరే నడుస్తున్నాయి! కాని 'వాళ్ళ' మోసపు సంభాషణ మాత్రం మనకు తెలియదు! రాష్ట్ర విభజన సమస్యపై వీళ్ళు ఇక్కడ రాష్ట్రప్రజలకు చెప్పేదొకటి, ఢిల్లీ పరుగెత్తి అక్కడ నాయకత్వం చెవిలో ఊది వచ్చేదొకటీ! భాషాజ్ఞానం నుంచే గాక, చరిత్ర పాఠాలను కూడా పాఠ్యప్రణాళికల్నుంచి ఎత్తించి వేయించిన ఘనులు మన పాలకులు!

 

అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, తెలుగుజాతి చరిత్ర తెలియని ఆ చరిత్రలో బొత్తిగా సంబంధం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం తెలుగుజాతిని అవమానిస్తూ రాష్ట్ర నాయకుల్ని తన చుట్టూ గానుగెద్దుల్లాగా తిప్పుకుంటున్నా రాష్ట్రనాయకులకు సిగ్గులేదు. ఇది దుర్భరం! తెలుగువారికి అవమానకరం. డాక్టర్ అంబేడ్కర్ పదేపదే హెచ్చరించినట్టుగా పార్లమెంటులో మెజారిటీ స్థానాలు దక్కించుకునే కోరికను సఫలం చేసుకునేందుకు కాంగ్రెస్ ఇన్నాళ్ళుగా ఆడుతూ వచ్చిన నాటకం మూడు ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలం మీద ఆధారపడి, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను ఉత్తరాదివారు దెబ్బతీస్తున్నారన్న భావన దక్షిణాది వారిలో కలిగే ప్రమాదం ఉందని మరచిపోరాదు. ఎంతసేపూ ఉత్తరప్రదేశ్ కు చెందిన 80-85 సీట్లపైన, మధ్యప్రదేశ్, బీహార్ స్థానాలపైన కాంగ్రెస్ దృష్టి పెట్టడంవల్లనే అనేక దఫాలుగా ఆ పార్టీ సంక్షోభాలు ఎదుర్కొనక తప్పడంలేదు! ఈ గుర్తింపు, జ్ఞానం కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పటికీ లేదు. కనుకనే తమ లాభలబ్ది కోసం ఎక్కడికక్కడ తాడూబొంగరం లేని రాజకీయ విధానాలతో, కుట్రలతో 'వోటు-సీటు' ప్రయోజనాలతో ప్రజలను విభజించి తమ పబ్బం గడుపుకునే స్థానికపార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉండటం.


 

పైగా తెలుగుజాతి చరిత్ర గురించి, అది చరిత్రలో భాషా వ్యాప్తి ద్వారా, వందల, వేల సంవత్సరాల స్వీయ సంస్కృతీ విభావంతో మగధనుంచి మచిలీపట్నందాకా [మూడు ప్రాంతాలూ] శాతవాహన, కాకతీయ, విజయనగర యుగాల దాకా విలసిల్లిందని తెలియని కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోని తెలుగేతర "మాయలమారుల'' దుష్టచతుష్టయం [దిగ్విజయ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, తాజాగా ఆంటోనీ] తొమ్మిది కోట్ల మంది తెలుగుప్రజల భావితవ్యంతో జూదమాడుతున్నారు! ఈ విషయం తెలిసి కూడా కేవలం పదవులకోసం జాతి విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పచ్చి అవకాశవాద రాజకీయాల్లోకి జారుకున్న కొన్ని ప్రతిపక్షాల నాయకులూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.


 

రాజకీయ శక్తిగా రాష్ట్రప్రజా బాహుళ్యంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన సమస్త ప్రతినిధుల సమక్షంలో చర్చలు జరపకుండా కేవలం ఒక రాజకీయపార్టీకి చెందిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకపక్షంగా చేసిన రాష్ట్ర విభజన తీర్మానాన్ని కాలదన్ని రాష్ట ప్రయోజనాలను, తెలుగుజాతి ఐక్యతనూ కాపాడవలసిన ప్రధాన పార్టీల రాష్ట్రనాయకులు చొల్లుకబుర్లతోనూ, పనికిమాలిన "ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో''నూ కాలక్షేపం చేస్తున్నారు. కేంద్ర కాంగ్రెస్ స్వార్థబుద్ధితో చేసిన చారిత్రిక తప్పిదాన్ని తిప్పికొట్టే భారమూ, బాధ్యత, ఉద్యోగ, కార్మిక, కర్షక, విద్యార్థులు, యువత, మహిళాది వర్గాలపైన రాజకీయ పార్టీల స్వార్థపర నాయకులు మోపేశారు!
 


ఒకడు ప్రజల "ఆత్మగౌరవా''న్ని ఢిల్లీ వీథుల్లో కేంద్ర పాలకులకు పాదాక్రాంతం చేశాడు; ఇంకొకడు తన స్వార్థంకోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఆవురావురుమని అంగలార్చి, ఆ అవకాశం చివరికి తన చేజారిపోతుందన్న బెంగతో ఢిల్లీలో అనేకరోజుల తరబడి కాంగ్రెస్ నాయకత్వంతో రహస్య మంతనాలు జరిపి తన వేర్పాటువాదం ద్వారా విభజన ప్రక్రియ కోసం "సెలైన్ సత్యాగ్రహం'' తతంగాన్ని నడిపి కేంద్రాన్నీ, ప్రజలనూ మభ్యపెట్టిన స్థానిక పార్టీ మోసగాడైన 'దొర'; ఇంకొకడు పేరుకు 'వామపక్షం' అని చాటుకొంటూనే, తెలుగుజాతిని ఒక్క తాటిపైకి తెచ్చిన తెలంగాణా రైతాంగ సాయుధపోరాట స్ఫూర్తిని గాలికి వదిలేసిన వారు;ఇక మరొకడు ఇదీ అదీ గాదు "అత్తమీద కోపాన్ని దుత్తమీద తీర్చుకు''న్నట్టుగా ఒక మాజీముఖ్యమంత్రి కొడుకుమీద దుగ్ధనుతన ఆస్తిపాస్తుల రక్షణార్థం, కేంద్రానికి మోకరిల్లి తనపై వచ్చిన ఆర్థిక నేరారోపణలనుంచి ఎలాగోలా బయటపడడం కోసం కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలుగుజాతి విభజన ప్రతిపాదనకు స్వయం లేఖ ద్వారా దొంగచాటుగా మద్ధతు తెలిపివచ్చి, ఇప్పుడు "సమన్యాయం'' కల్పించాలన్న భట్టిప్రోలు పంచాయితీతో కాలక్షేపం చేస్తూ రాష్ట్రపర్యటనకు బయలుదేరి ఆత్మగౌరవం కోల్పోయి అడుగడుగునా అభాసుపాలవుతున్న ఒక రాష్ట్ర మాజీముఖ్యమంత్రీ!


 

ఈ అవకాశవాద రాజకీయాలను దళిత, బహుజనవర్గాలకు కూడా పాకించడం  - వీళ్ళు ప్రజాక్షేమం కోరిన రాజకీయులు కారనీ, సంపన్న రాక్షససంతతి అనీ మరొకసారి నిరూపితమయింది! ఇక మరో పోర్ఫేసర్ ఉన్నాడు, ఆయనగారు ముఖ్యమంత్రినీ, ఇతర మంత్రులనూ జీతాలు తీసుకోవటం మానేసి, రాజీనామాలు చేసి బయటకు రమ్మంటూ తాను మాత్రం పిల్లలకు పాఠాలు చెప్పడం మానేశాడు, యూనివర్సిటీనుంచి నెలవారీ జీతం [లక్షరూపాయలకు పైగానేనని ఉస్మానియా వర్గాలు] క్రమం తప్పకుండా పొందుతూ ఒక వేర్పాటు సంయుక్త కార్యాచరణ సంస్థకు నాయకస్థానంలో ఉన్నాడు. అయినా వేర్పాటువాద స్థానిక పార్టీపెట్టిన నాయకుడికీ, సంయుక్త కార్యాచరణ పేరిట వేరొక కుంపటి పెట్టిన ఈ ప్రొఫెసర్ కూ మధ్య పడిచావక [ఎందుకు పడటంలేదో చెప్పకుండా] ఎవరి దుకాణం వారు నడుపుకుంటున్నారు. ఉభయ వర్గాలు బెదిరింపుల ద్వారా వసూళ్లు మాత్రం చేసుకుంటున్నారని ఆ రెండు క్యాంపుల్లోని వారూ పరస్పరం ఆరోపించుకుంటున్నారు!



ముఖముఖాలు చూసుకోకపోయినా "కలిసే ఉన్నట్టు''గా ప్రజల్ని మాత్రం మోసగిస్తున్నారు. టాంక్ బండ్ విధ్వంసకాండకు కారణం నీవంటే నీవని వాదించుకున్నారు. ఇక స్థానిక పార్టీ నాయకుడైన 'దొర' ఊసరవెల్లి మాదిరిగా పొంతన లేకుండా వేర్వేరు ప్రకటనల ద్వారా ప్రాంతప్రజలను మభ్యపెడుతున్నాడు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం రేపో, మాపో వస్తుందని దాదాపు సంవత్సరకాలంగా ఊరిస్తూనే ఉన్నాడు! ఆ నమ్మకం సడలి పోయింతరువాత తేదీలు జరుపుకుంటూ వెడుతూన్నాడు ఇంతకూ కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిపిన చర్చలు ఏమి హామీపడ్డాడో ఇతడు తెలియదుగాని, సమస్యను "వాయిదాల రత్తయ్య''లా నానబెట్టడంలో అధిష్ఠానంతో 'మిలాఖత్' అవుతున్నాడు! విఫలమైన, మసకబారిన తన 'గౌరవాన్ని'' నిలబెట్టుకునే తాపత్రయంలో కాంగ్రెస్ లో తన పార్టీని "విలీనం'' చేస్తానని యిచ్చిన హామీ విషయంలో కూడా ప్రజల్ని మోసగించడానికిగాను ఒక్కోసారి ఒక్కో ప్రకటన చేస్తున్నాడు.

 

మొదట్లో హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాలస్వతంత్ర రాష్ట్రమైతేనే "ఒప్పుకుంటా''నని చెప్పిన ఈ మాటకారి హైదరాబాద్ ప్రతిపత్తిపైన కూడా తన వైఖరిని క్రమంగా మార్చుకుంటూ వస్తున్నాడు; ముందు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచడానికి కూడా అంగీకరించని ఈయన, హైదరాబాద్ ప్రతిపత్తిపైన వచ్చిన మూడు రకాల కేంద్ర ప్రత్యమ్నాయాలలో తాను దేనికి సుముఖమో చెప్పకుండా దాటవేస్తూ "ఉమ్మడి రాజధానిగా రెండేళ్ళకు మించి ఒప్పుకునేది లేదని'' కొత్త ప్లేటు పెట్టాడు. కాంగ్రెస్ లో తన పార్టీ కలిసిపోవాలంటే ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని, ఆ తర్వాత తన పార్టీని 'గంగ' (కాంగ్రెస్)లో కలిపేస్తానని బీరాలు పలికిన ఈ అవకాశవాద నాయకుడు ఇక "ప్రత్యేక రాష్ట్ర్త''బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోవచ్చుననీ, అయితే 'హైదరాబాద్' అంశం తెలంగాణా ప్రజలు కోరుకుంటున్నట్టుగా  ఉండకపోవచ్చు''ననీ ఏదైనా "కిరికిరి పెట్టే అవకాశముందనీ'' "ఫామ్ హౌస్ నాయకుడు'' నెమ్మదిగా బయటపడ్డాడు!

 

అంటే, ఈ "దొర''నిత్యం కాంగ్రెస్ అధిష్ఠానంతో ఎలా మంతనాలు సాగిస్తున్నాడో, వ్యవహారమంతా రకరకాల ప్రభావాలకు లోనైన వ్యక్తిగా ఫామ్ హౌస్ నుంచే ఎలా నడిపిస్తున్నాడో రాష్ట్రప్రజలందరికీ దాచినా దాగని సత్యంగా గుట్టు బయట పడిపోయింది! ఇప్పుడతని బాధంతా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందో లేదోనన్న బాధకన్నా, ఏర్పడకపోతే తనను తెలంగాణా ప్రజలనుంచే చుట్టుముట్టే భయంకర పరిస్థితుల్ని తాను చవిచూడవలసి వస్తుందేమానాన్న విచారమే ఎక్కువగా ఆయన్ని పట్టిపీడిస్తోంది! కనుకనే కాంగ్రెస్ అధిష్ఠానం తద్వారా స్థానిక కాంగ్రెస్ నాయకత్వాలు "కుడితిలో పడిన ఎలుకలా'' కొట్టుకు చస్తున్నాయి! అంటే దారితప్పిన నాయకులందరికీ అధిష్ఠానం ఏం చెబుతుందో ప్రజలకు తెలియదు, అన్ని రకాల నాయకులు, మంత్రులు, ఎం.పీ.లూ, ఎం.ఎల్.ఎ.లూ తిరిగి అక్కడ ఏం చెప్పారో, ఇక్కడ జనాలకు ఏమి చెబుతున్నారో ప్రజలకు తెలియదు; ఏతావాతా రాష్ట్ర సమస్య తేలకుండా, అలా మరికొన్నాళ్ళు నానుతూ ఉంటుంది! నాయకుల మంతనాల రహస్య లిపిని బద్ధలు కొట్టాల్సినవారు ప్రజలే!