కలెక్టర్ ను హీరోయిన్ లా ఉన్నారన్న ఎమ్మెల్యే.. కేసు నమోదు..
posted on May 31, 2016 11:33AM
రాజకీయ నేతలు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బుక్కవుతుంటారు. ఇప్పుడు ఓ ఎమ్మెల్యే మహిళా కలెక్టర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బుక్కయ్యాడు. అసలు సంగతేంటంటే.. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా.. సీతాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆ పార్టీ ఎమ్మెల్యే అమర్ జీత్ భగత్ మాట్లాడుతూ.. సర్‌గుజా జిల్లా కలెక్టర్ రితూ సేన్‌ను చూసి, ఆమె చాలా అందంగా ఉందని, హీరోయిన్‌లా ఉందిగానీ ఆమె నటించడం తానెప్పుడూ చూడలేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అక్కడితో ఆగకుండా.. తన 48 ఏళ్ల జీవితంలో విద్యాశాఖ మంత్రి కేదార్ కశ్యప్ లాంటి పిచ్చివాడిని చూడలేదని అన్నారు. ఇక అంతే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న ఆయన ఒక మహిళపట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇక బేజేపీ నేతలు కూడా భగత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.