ఏపీలో కమల వికాసానికి నాలుగేళ్ళు సరిపోతుందా?
posted on Apr 13, 2015 1:23PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలనే విషయంలో తమకు ఎటువంటి సందేహాలు, సందిగ్ధం లేదనే సంగతిని నిన్న వైజాగ్ లో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో తేటతెల్లమయింది. రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్-చార్జ్ మరియు కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి జేపీ. నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అగ్రనేతలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాక్యాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణాతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత నెలకొని ఉంది గనుక రాష్ట్రంలో బలపడటానికి పార్టీకి ఎక్కువ అవకాశాలున్నాయని అన్నారు. కనుక ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా పార్టీకి గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల మాదిరిగా కంచుకోటలా తయారుచేయాలని కోరారు. దేశంలో మరే ఇతర రాష్ట్రానికి ఇవ్వనంతగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా నిధులు, ప్రాజెక్టులు తమ ప్రభుత్వం మంజూరుచేస్తోందని, అదే విషయాన్ని రాష్ట్రంలో గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలని ఆయన సూచించారు. అందుకోసం త్వరలో ‘జన్ మహా సంపర్క్ అభియాన్’ అనే కార్యక్రమాన్ని చేప్పట్టి వరుసగా మూడు నెలల పాటు కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసిన, చేస్తున్న నిధులు, మంజూరు చేసిన ప్రాజెక్టుల గురించి ప్రచారం చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రచార కార్యక్రమానికి డి. పురందేశ్వరిని కన్వీనర్ గా నియమించారు.
తెలంగాణాతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీజేపీ బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని ఆయన భావించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణాలోనే బీజేపీ బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఆంధ్రాలో తెదేపాతో అంటూ కట్టిన తరువాత, కేంద్రంలో మోడీ నాయకత్వంలో బలమయిన కేంద్రప్రభుత్వం ఏర్పడిన తరువాత నుండే బీజేపీకి రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. లేకుంటే నేడు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి వేరేలా ఉండేది.
రాష్ట్ర విభజన కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం, దాని భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండటం వలన రాజకీయ శూన్యత ఏర్పడిందని బీజేపీ భావిస్తున్నట్లుంది. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెదేపా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపాలు చాలా బలంగా ఉన్నప్పుడు రాజకీయ శూన్యతకి చోటేలేదు. కానీ ఉందని బీజేపీ భావిస్తోంది. ఆ భ్రమలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో బలపడాలంటే ముందుగా ఆ పార్టీ నేతలు చురుకుదనం ప్రదర్శించాలి. కానీ వారిలో రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, పురందేశ్వరి వంటి నాయకులు తప్ప మరెవరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు, పధకాలు, ప్రాజెక్టుల గురించి చెప్పుకొన్న దాఖలాలు లేవు. అందుకే బీజేపీ ఇప్పుడు పనిగట్టుకొని ‘జన్ మహా సంపర్క్ అభియాన్’ వంటి ప్రచార కార్యక్రమాలను చేప్పట్టవలసివస్తోంది. కానీ మళ్ళీ అక్కడా మరో పొరపాటు చేస్తోంది. తెలుగు రాష్ట్రంలో బలపడాలనుకొంటున్న బీజేపీ తన ప్రచార కార్యక్రమానికి అచ్చమయిన తెలుగుపేరు పెట్టుకోకుండా హిందీ పేరు పెట్టుకొంటే అది ఎంతగా ప్రచారం చేసుకొన్నప్పటికీ ప్రజలకి పరాయిపార్టీగానే కనిపిస్తుంది.
రాష్ట్రంలో బీజేపీ బలపడాలంటే వేగంగా రాష్ట్రాభివృద్ధి జరిగేందుకు తోడ్పడాలి. ఆ విషయంలో బీజేపీ చిత్తశుద్ధిని శంఖించనవసరం లేదని స్పష్టమవుతోంది. కానీ తెదేపా ప్రభుత్వం కూడా రాష్ట్రాభివృద్ధి చేసి ప్రజలను మెప్పించి వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలనుకొంటోంది కనుక బీజేపీ ఆ క్రెడిట్ మొత్తాన్ని తన పద్దులోనే వ్రాసేసుకోవడానికి వీలుపడదు. ఒకవేళ వచ్చేఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇదే అంశం వారికి వరంగా మారుతుంది. అలాకాక బీజేపీ వేరేగా పోటీ చేయదలిస్తే అది ఎంతగా ప్రచారం చేసుకొన్నప్పటికీ ప్రజలు స్థానిక పార్టీ అయిన తెదేపావైపే మొగ్గు చూపవచ్చును.
బహుశః దీనిని దృష్టిలో పెట్టుకొనే బీజేపీ కాంగ్రెస్, వైకాపాలకు చెందిన నేతలను పార్టీలోకి ఆకర్షించడం ద్వారా ‘స్థానిక ముద్ర’ పొందాలని ప్రయత్నిస్తోందేమో? క్రిందటి సారి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడు రాష్ట్రంలో పార్టీ బలపడేందుకు దిశానిర్దేశం చేసారు. కానీ ఆనాడు ఆయన చేసిన సూచనలలో ఎన్నిటిని రాష్ట్ర నాయకులు తూచా తప్పకుండా ఆచరించారో ఒకసారి ఆలోచించుకొంటే, లోపం ఎక్కడ ఉందో అర్ధమవుతుంది. రాష్ట్ర నాయకులు ఇంత నిర్లిప్తత ప్రదర్శిస్తున్నప్పుడు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల మాదిరిగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ బలపడాలంటే ఈ నాలుగేళ్ల సమయం సరిపోకపోవచ్చును.