మహానీయులను రచ్చకీడ్చనేల?
posted on Apr 11, 2015 1:04PM
దేవుళ్ళని, స్వాతంత్ర సమరయోధులని కూడా కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా పంచుకొన్న ఘనత మనకే ఉంది. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ, నెహ్రూలను మాత్రమే భుజానికెత్తుకొని వారికి మాత్రమే చాలా ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. కానీ మోడీ ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టగానే గాంధీ నెహ్రులను పక్కనబెట్టి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కి ప్రాధాన్యం ఈయడం మొదలుపెట్టారు. ఏ పార్టీ గుర్తించినా గుర్తించకపోయినా ఆ మహనీయుల ప్రాధాన్యం ఎన్నడూ తగ్గదు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ మహనీయులను ఎవరూ తొలగించలేరనే సంగతి విస్మరించి ఒక్కో రాజకీయపార్టీ ఒక్కో మహనీయుడిని భుజానికెత్తుకొని ఆయనపై ‘పేటెంట్ హక్కులు’ కేవలం తమ పార్టీకి మాత్రమే ఉన్నాయన్నట్లు మాట్లాడుతూ ఆయనని తామే లోకానికి కొత్తగా పరిచయం చేశామనే భ్రమలో ఉండటం చూసి దేశప్రజలు వారి అజ్ఞానానికి నవ్వుకోకుండా ఉండలేరు.
స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుబాష్ చంద్రబోస్ సోదరుని కుమారులపై నెహ్రూ ప్రభుత్వం 20 ఏళ్ళపాటు నిఘాపెట్టిందనే వార్తలు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల మధ్య మరో కొత్త యుద్దానికి కారణమయ్యాయి.
విమాన ప్రమాదంలో చనిపోయారనుకొన్న నేతాజీ దాని నుండి తప్పించుకొని బయటపడినట్లు నాటి ప్రధాని నెహ్రుకి అనుమానం కలగడంతో మళ్ళీ ఆయన తిరిగివచ్చి తన చేతిలో నుండి ఎక్కడ అధికారాన్ని లాక్కొంటారనో అనే అనుమానం, భయంతోనే నేతాజీ కుటుంబ సభ్యులపై నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టినట్లుందని బీజేపీ అధికార ప్రతినిధి నళిని కోహ్లీ విమర్శించారు.
కాంగ్రెస్ రక్తంలోనే గూడచర్యమనే ఈ అవలక్షణం ఇమిడి ఉందని, అది నాటి నుండి నిన్న మొన్నటి వరకు కూడా కొనసాగిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. నెహ్రు ప్రభుత్వం నేతాజీ కుటుంబం మీద గూడచర్యానికి పాల్పడితే, ఆయన కుమార్తె స్వర్గీయ ఇందిరా గాంధీ తన కోడలు మీదే నిఘా పెట్టించారని, ఆ తరువాత అధికారం చేప్పట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా ఆ ఆచారానని తూచా తప్పకుండా పాటించాయని ఆమె విమర్శించారు.
అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగానే బదులిచ్చింది. “బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే ప్రముఖ నేతల మీద బురద జల్లుతోంది. దాని వెనుక ఆర్.యస్.యస్. ఉంది. వారు ఉద్దేశ్యపూర్వకంగానే కొన్ని లేఖలలో, పత్రాలలో ఉన్న కొన్ని అంశాలను మాత్రమే మీడియాకు ఈవిధంగా లీక్ చేస్తూ నెహ్రూ అంతటివాడిని కూడా దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నెహ్రూ ప్రభుత్వంలో లాల్ బహద్దూ శాస్త్రి, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్, సి. రాజగోపాలాచారి వంటి హేమాహేమీలు హోం మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారనే సంగతి బీజేపీ నేతలు మరిచిపోయి నెహ్రు మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నేతాజీ కుటుంబ సభ్యులపై నెహ్రూ ప్రభుత్వం అటువంటి నిఘా పెట్టి ఉండి ఉంటే, ఆ విషయం ఆయనకంటే ముందుగా హోం మంత్రులుగా చేసినవారందరికీ తెలుస్తుంది. అంటే వారిని కూడా దోషులని బీజేపీ భావిస్తోందా?” అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీలు ఒకదానిమీద మరొకటి పై చెయ్యి సాధించేందుకు ఎప్పుడో జరిగిపోయిన విషయాలను త్రవ్విపోసుకొంటూ, ఆ ప్రయత్నంలో ఈవిధంగా మహనీయులను కూడా రచ్చకీడ్చడాన్ని ఎవరూ హర్షించరు. ఒకవేళ వారిపై ఆ రెండు పార్టీలకి అంతగా అభిమానం గౌరవం ఉంటే వారు చూపిన మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తే అందరూ హర్షిస్తారు. కానీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల కోసం మహనీయులను కించపరిస్తే అందుకు వారే భారీ మూల్యం చెల్లించక తప్పదు.