రాత్రివేళ రాములవారి కల్యాణం – ఒంటిమిట్టకే ప్రత్యేకం
శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించడం తెలుగునాట ఆనవాయితీ. దానికి పునాది భద్రాచలంలో ఏర్పడిందని చెబుతారు. తెలుగుదేశంలో మరో రామక్షేత్రమైన ఒంటిమిట్టలో దీనికి కాస్త విభిన్నమైన సంప్రదాయం కనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశినాటి రాత్రి రాములోరి కల్యాణం జరుగుతుంది. ఆ ఒంటిమిట్ట గురించి చెప్పుకోవడం మొదలుపెడితే చాలా విశేషాలే వినిపిస్తాయి...
రాముడు అయోధ్యాపురిలో జన్మించినా వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశారని అంటారు. అందుకే శ్రీలంక వరకూ దక్షిణభారతం పొడవునా రామాయణ ఘట్టాలకి సంబంధించిన క్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒంటిమిట్ట కూడా ఒకటి. ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అన్న పేరు ఉంది. ఆ ఏకశిలకు దగ్గర్లోనే మృకండుడు అనే మహర్షి తపస్సు చేసుకునేవారట. రాములవారు అరణ్యవాసంలో భాగంగా అటు సంచరిస్తూ కొద్ది రోజులు మృకండునికి రక్షణగా ఇక్కడ ఉన్నారని స్థలపురాణం చెబుతోంది.
రాములవారు ఇక్కడ నిలిచిన సమయంలోనే సీతాదేవికి విపరీతమైన దప్పిక కలిగిందట. అప్పుడు రామచంద్రుడు తన బాణాన్ని పాతాళంలోకి సంధించగా... మంచినీట ఊరిందని చెబుతారు. అదే ఈనాడు రామతీర్థంగా పిలుచుకునే చెరువని, రాములవారు నిలబడిన చోటే కోదండరామాలయాన్ని నిర్మించారని భక్తుల నమ్మకం. ఏకశిలకీ రామునికీ మధ్యగల అనుబంధం గురించి విజయనగర రాజులకు తెలియడంతో.... ఒంటడు, మిట్టడు అనే స్థానిక బోయల సాయంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మింపచేశారట. అందుకనే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అన్న పేరు స్థిరపడిందంటారు.
ఒంటిమిట్ట ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలు మూడూ ఒకటే శిలలో చెక్కడం విశేషం. ప్రతి రామాలయంలోనూ కనిపించే ఆంజనేయస్వామి విగ్రహం ఈ ఆలయంలో కానరాకపోవడం మరో విచిత్రం. రాములవారు ఆంజనేయుని కలవక ముందే ఇక్కడకు వచ్చారనీ... అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉండదని చెబుతుంటారు. శతాబ్దాలుగా ఒంటిమిట్ట రామాలయం భక్తులకు పుణ్యతీర్థంగా ఉండేది. పోతన సైతం ఇక్కడే భాగవతాన్ని అనువదించాడనీ, అన్నమయ్య కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడనీ చెబుతారు. ‘ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని/ విందువలె నొంటిమిట్ట వీర రఘురాముని’ అంటూ అన్నమాచార్య కీర్తనల్లో ఒంటిమిట్ట రాముని కనిపిస్తుంది.
పైన చెప్పుకొన్న విశేషాలన్నీ ఒక ఎత్తయితే... శ్రీరామనవమి సందర్భంగా చతుర్దశి రాత్రివేళ కల్యాణాన్ని నిర్వహించడం ఒక ఎత్తు. పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుని ఊరడించేందుకు, రాములవారు ఇక్కడ రాత్రివేళ కల్యాణం జరిగేలా వరాన్ని ఒసగారని ఒక గాథ ప్రచారంలో ఉంది. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా... రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని చెబుతారు.
కారణం ఏదైనా ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం చతుర్దశి నాటి రాత్రి, పౌర్ణమి రోజున రథోత్సవం ఘనంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడంతో... ఒంటిమిట్టకు అక్కడి ప్రభుత్వం మరింత ప్రాధాన్యతను ఇస్తోంది. 2015 నుంచి ప్రభుత్వ లాంఛనాలతో, టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆ ఉత్సవం ఏప్రిల్ 10న జరగనుంది.
- నిర్జర.