రామాయణంలో మలుపు తెచ్చిన ‘శూర్పణఖ’

 



(శ్రీ రామ నవమి సందర్భంగా)

‘శూర్పనఖ’

శ్రీమద్రామాయణంలోని అతి ముఖ్యమైన పాత్రలలో ‘శూర్పనఖ’ ఒకటి. నిజానికి ‘సీతా కల్యాణంతో’ రామాయణం అయిపోయినట్టే. కానీ...అలా ముగియలేదు.

‘అయోధ్యాకాండ’లో ప్రవేశించిన ‘మంథర’ రామకథను ‘అరణ్యకాండ’ వరకూ లాగితే .. ‘అరణ్యకాండ’లో దర్శనమిచ్చిన ఈ ‘శూర్పనఖ’ పాత్ర ‘యుద్ధకాండ’ వరకూ సాగతీసింది. ఈ రెండు పాత్రలు స్త్రీ పాత్రలే కావడం విశేషం. ఈ రెండు పాత్రలే లేకపోతే....శ్రీరాముడు...పితృవాక్య పరిపాలనా దక్షుడుగానూ...., రావణసంహారం చేసి జగదేక వీరుడుగాను కొనియాడబడే వాడే కాదు. ‘ఒక వ్యక్తి విజయం వెనుక  స్త్రీ ఉంటుంది ’ అనే నానుడి మనందరకూ తెలిసినదే. కానీ... సృష్టిలో.... ఓ మార్పు.., ఓ చైతన్యం వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే అందుకు ‘స్త్రీ’ కారణం అని ఒప్పుకుతీరాలి. మహాయుద్ధాలు జరిగినా... మహాసామ్రాజ్యాలు  పతనమైపోయినా...నూతన సామ్రాజ్యాలు స్థాపించబడినా.. అందుకు కారణం ‘స్త్రీ’ అనునది చరిత్ర కాదనలేని సత్యం. ఆ కోవకు చెందినవారే మంథర.., శూర్పనఖ. ముందు ‘శూర్పనఖ’ పాత్రను పరిశీలిద్దాం.

విశ్రవోబ్రహ్మకు....బాక అను స్త్రీ యందు కలిగిన కుమార్తె ఈ శూర్పనఖ. ఈమె రావణునికి సవతి చెల్లెలు. ఖర, దూషణులు ఈమె సొంత సోదరులు. రావణుడు.. శూర్పనఖను ఏనాడూ సవతి చెల్లెలులా చూడలేదు. ఎంతో ప్రేమగా., గారంగా చూసుకునేవాడు. శూర్పనఖ కూడా రావణుని అలాగే అభిమానించేది. శూర్పనఖ వివాహం గురించి రావణుడు ఎన్నో కలలు కనేవాడు. జగదేకవీరుడైన దానవ యువకునితో శూర్పనఖ వివాహం చెయ్యాలని ఆరాటపడేవాడు. అయితే... శూర్పనఖ... విద్యుజిహ్వుడనే ఓ దానవ యువకుని ప్రేమించింది. ఈ సంగతి తెలిసి రావణుడు ఉగ్రుడై....‘మన వంశప్రతిష్ఠ, అంతస్థు తెలిసే ఆ విద్యుజిహ్వుని ప్రేమించావా.. పిచ్చి ఆలోచనలు మానుకో’ అని శూర్పనఖను హెచ్చరించి.. ఆమెకు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. శూర్పనఖ తన ప్రేమ విషయంలో రావణునితో రాజీ పడదలుచుకోలేదు. సరైన సమయం చూసి విద్యుజిహ్వునితో పారిపోయి పెళ్లి చేసుకుంది. ఇది రావణునికి ఊహించని ఎదురుదెబ్బ. అటు చెల్లెలి మీద తనకున్న ప్రేమను చంపుకోలేడు... అలాని ఆమె ప్రేమను సమర్థించలేడు. ఎన్నో రోజుల మానసిక సంఘర్షణ అనుభవించిన తర్వాత.... శూర్పనఖ మీద మమకారం చంపుకోలేక... తనే రాజీపడిపోయి.. శూర్పనఖ, విద్యుజిహ్వులను సాదరంగా రావించి., వారిద్దరికి ఘనంగా వివాహం జరిపించాడు రావణుడు. శూర్పనఖ, విద్యుజిహ్వుల సుఖసంసారయాత్రకు ప్రతిఫలంగా ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు ‘జంబుకాసురుడు'.

ఒకసారి రావణుడు కాలకేయుల మీదకు యుద్ధానికి వెడుతూ... విద్యుజిహ్వుని తనకు తోడుగా తీసుకెళ్ళాడు. కాలకేయులతో యుద్ధం భీకరంగా సాగుతోంది. ఆ యుద్ధంలో విద్యుజిహ్వుని శత్రుపక్ష వీరుడని తలచి... పొరపాటున అతని తల నరికి చంపాడు రావణుడు. తర్వాత నిజం తెలిసి చాలా బాధ పడ్డాడు రావణుడు. అయితే... తన భర్తను రావణుడు పొరపాటున చంపలేదని.., కావాలనే చంపాడని నమ్మిన శూర్పనఖ.. రావణుని నానా మాటలు అంది... దూషంచింది. రావణుడు మౌనంగా అన్నీ భరించి.., శూర్పనఖను ఓదార్చి... దండకారణ్యాన్ని ఆమెకి అరణంగా ఇచ్చి స్వేచ్ఛగా బతకమన్నాడు. శూర్పనఖ తన కుమారుడు జంబుకాసురుని తీసుకుని దండకారణ్యానికి వచ్చిందన్న మాటేగానీ...రావణుడు తనకు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదు. తను అనాధగా మిగలడానికి రావణుడే అని తలచి అతనిమీద పగ పెంచుకుంది. కానీ...ఆడది..అనాథ...త్రిలోకైకవీరుడైన రావణుని ఎలా ఎదిరించగలదు ? రావణుని సంహరించే వీరుని కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతోంది. అలాంటి సమయంలో శ్రీరాముడు ఆమె కళ్ళబడ్డాడు. రాముని సౌందర్యం ఆమె కనురెప్ప వెయ్యనివ్వలేదు. మనసును మన్మథుడు జయించాడు. కామం నిండిన కళ్లతో రాముని దగ్గరకు వచ్చి తన కోరిక తీర్చమని అర్థించింది..విఫలురాలయింది. ఆ తర్వాత రాముని సలహా మేరకు లక్ష్మణుని వెంటబడింది. అక్కడ కూడా భంగపడింది.

తన కామతృష్ణ తీరకపోవడానికి కారణం సీత అని తెలుసుకుని, ఆమెను చంపడానికి ప్రయత్నించి లక్ష్మణుని చేతిలో ముక్కు, చెవులు కోయించుకుని, అవమానభారంతో తన అన్న ఖరుని ముందు కన్నీళ్లతో నిలబడింది. శూర్పనఖకు జరిగిన పరాభవానికి ఖరుడు  ఉగ్రుడై ‘ సోదరీ...బాధపడకు...నేనే దగ్గరుండి నీ కోరిక నెరవేరేలా చేస్తాను. నాతో రా’ అని తన పదునాలుగు వేల రాక్షస సైన్యంతో బయలుదేరాడు. శూర్పనఖ అతనిని అనుసరించింది. అయితే రాముడు ఒక్కడే యుద్ధరంగంలో నిలిచి ఆ రాక్షస సైన్యాన్ని మొత్తం సంహరించాడు. అది చూసి శూర్పనఖ అదిరిపోయింది. రామునకు... సీత అంటే ఎంత ప్రేమో కూడా ఆమెకు అర్థమైంది. ఇన్నాళ్ళకు రావణుని ఎదిరించి తన పగ తీర్చగల మగాడు కనిపించినందుకు సంతోషించింది. ఆడది కనుక బయటపడకుండా.. ఓ పథకంతో రావణుని దగ్గరకు వెళ్లింది. అప్పుడు రావణుడు సభలో ఉన్నాడు. తెగించిన ఆడది కదా...అందుకే ఏమాత్రం భయపడకుండా ఏడుపు నటిస్తూ...రావణుని ముందు నిలబడింది. విరూపగా ఉన్న శూర్పనఖను చూసి ‘ఎవరీ దారుణం చేసింది?’ అని ప్రశ్నించాడు.

అసలు విషయం చెప్పకుండా.. ‘వరబలగర్వితుడవై..నీకు రాబోయే ఆపదను తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. అచిర కాలంలోనే నీవు రాజ్యభ్రష్ఠుడవు అవుతావు. ఎండిన కర్రలు, మట్టిబెడ్డలు, బూడిద కూడా ఎందుకైనా పనికి వస్తాయి గానీ... రాజ్యభ్రష్ఠుడైన రాజు ఎందు పనికిరాడు’ అని మాటలతో రావణుని రెచ్చగొట్టింది. ‘అసలు కారణం చెప్పకుండా ఈ నిందలేమిటి’ అని ప్రశ్నించాడు రావణుడు.

అప్పుడు ప్రేమ నటిస్తూ...‘ అన్నా నా ఈ విరూపానికి కారణం రాముడనే నరుడు. వాడి భార్య సీత అతిలోక సౌందర్యవతి. నీదగ్గరున్న సుందరీమణులుదరూ ఆ సీత సౌందర్యం ముందు దిగదుడుపే. ఆ సీతను నీకు భార్యగా చేద్దామని ప్రయత్నించి ఈ గతి తెచ్చుకున్నాను’ అంది. అప్పుడు రావణుడు రక్తలోచనుడై..‘బాధపడకు సోదరీ..ఆ సీతను నా భార్యగా కాదు...బానిసగా తెచ్చి పడేస్తాను’ అని బయలుదేరాడు. రావణుడు అలా అంటాడని శూర్పనఖకు తెలుసు. రావణుడు సీతను అపహరించగలిగితే...రాముని చేతిలో మరణిస్తాడని శూర్పనఖకు తెలుసు. తనకు కావలసిందీ అదే. అదే జరిగింది కూడా. అయితే...శూర్పనఖ పగ, ప్రతీకారం ఒక్క రావణుని మాత్రమే కాదు... మొత్తం రాక్షసజాతినే సమూలంగా నాశనం చేసింది. అందుకే... పరస్త్రీ వ్యామోహం.. పరపురుష బలహీనత పతనానికి దారితీస్తాయని గ్రహించండి. శూర్పనఖ పాత్ర ద్వారా వాల్మీకిమహర్షి సకల మానవాళికీ బోధించే నీతి ఇదే.

-యం.వి.యస్.సుబ్రహ్మణ్యం   

 


More Sri Rama Navami