సీతారాముల కళ్యాణం జరిగింది ఇక్కడే!

 

రామాయణం ఖచ్చితంగా జరిగింది అని ప్రపంచాన్ని ఒప్పించడం కష్టమే కావచ్చు. కానీ అది జరిగే ఉంటుంది అని భక్తులు నమ్మేలా మన దేశంలోని అణువణువూ ఆ కావ్యంతో ముడిపడి ఉంది. శ్రీలంక మొదలుకొని నేపాల్ వరకూ రామాయణంతో పేర్కొన్న ప్రాంతాలు కనిపిస్తాయి. అందుకే రామాయణాన్ని పురాణం అనలేదు... ఇతిహాసం అన్నారు. అలా రామాయణంలో పదే పదే ప్రస్తావించబడిన రాజ్యం మిథిల!

అదిగో మిథిల

రామాయణం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అయోధ్య, లంక, రామసేతు, పర్ణశాల వంటి ప్రాంతాల గురించి గుర్తుచేసుకుంటామే కానీ మిథిల గురించి అంతగా ఆసక్తి చూపం. ఈ ప్రాంతాలన్నింటిలాగానే మిథిల కూడా ఇప్పటికీ ప్రజల నోట నిలిచి ఉంది. ఒకప్పుడు బీహార్ నుంచి నేపాల్ వరకూ ఈ మిథిలా రాజ్యం విస్తరించి ఉందని చెబుతారు. ఈ భాగాన్నంతా ఒక ప్రత్యేక ప్రాంతంగా గుర్తించాలంటూ "Free Mithila state" పేరుతో ఒక ఉద్యమం కూడా జరుగుతోంది. మన సీతమ్మ తల్లి జన్మించింది ఆ మిథిలా రాజ్యంలోనే కదా!

 

 

జనక్పురి

ఎప్పుడో వేదకాలం నుంచే మిథిలా రాజ్యం ఉండేదని చరిత్రకారులు ఒప్పుకొంటున్నారు. ఈ రాజ్యాన్ని విదేహ రాజ్యం అని కూడా పిలిచేవారట. ఆ పేరు మీదుగానే సీతమ్మకు వైదేహి అన్న పేరు వచ్చింది. అప్పట్లో జనకుడి రాజధానే ఇప్పటి నేపాల్లో ఉన్న జనక్పురి అని ప్రజల నమ్మకం. ఈ జనక్పురిలోని భూమిని దున్నుతుండగానే సీతమ్మ తల్లి కనిపించిందని చెబుతారు. సీతమ్మ తల్లి పెరిగి పెద్దదయ్యిందీ, రాముని కళ్యాణం చేసుకున్నదీ ఈ నగరంలోనేనని విశ్వసిస్తారు.

జానకీ మందిర్

సీతాదేవి జన్మించిన ప్రాంతం ఇదేనన్న విషయం కాలక్రమేణా ప్రజలు మర్చిపోయారు. సుర్కిశోర్దాస్ అనే సన్యాసికి 1657లో ఇక్కడ సీతాదేవి విగ్రహాలు లభించడంతో, ఇక్కడి ప్రజలు తమ చరిత్రను తిరిగి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు. ఆ చరిత్రకు చిహ్నంగా 1910లో వృషభాను అనే నేపాల్ రాణి ‘జానకీ మందిర్’ పేరుతో ఒక భారీ ఆలయాన్ని నిర్మించారు. వేల గజాల విస్తీర్ణంలో, 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో, పాలరాతి గోడలూ, అద్దాల మేడలతో నిర్మించిన ఈ ఆలయానికి తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చయిందట. అందుకనే ఈ ఆలయానికి ‘నౌ లాఖ్ మందిర్’ అన్న పేరు కూడా ఉంది.

కొత్త ఆలయం- పాత చరిత్ర

జానకీమందిర్ నిర్మించిన ప్రాంతంలోనే సీతాదేవి శివదనుస్సుని పూజించిందని చెబుతారు. సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ స్థలంలోనే అని భక్తుల నమ్మకం. అందుకనే జానకీమందిరంలోని నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపాన్ని నిర్మించారు. ఏటా మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున ఇక్కడ వైభవంగా సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. ఆ రోజే సీతారాముల వివాహం జరిగిందని అక్కడి ప్రజల నమ్మకం. (తెలుగువారు శ్రీరామనవమి రోజునే ఆయన కళ్యాణం జరిపేందుకు ఇష్టపడతారు).

 

 

ఘనంగా ఉత్సవాలు

ఆలయంలో కొలువైన సీతాసమేత రామునీ... అతని సోదరులైన లక్ష్మణ, భరత శత్రుఘ్నులని చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఇక్కడ కొలువైన సీతారాములని దర్శించి, వారి ఆశీస్సులను వేడుకునేందుకు నిత్యం వేలమంది జనం వస్తుంటారు. ఇక శ్రీరామనవమి, దసరా, సంక్రాంతి (తిహార్), వివాహ పంచమి (మార్గశిర శుక్ల పంచమి) పండుగలలో అయితే జనం పోటెత్తుతారు. వారి మనసు నిండేలా ఆ సమయంలో ఇక్కడి ఉత్సవాలూ ఘనంగా జరుగుతాయి.

ఇదీ జనక్పురి ప్రత్యేకత. రామాయణంతో ఈ ప్రాంతానికి ఉన్న సంబంధం దృష్ట్యా రామభక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే తప్ప తమ తీర్థయాత్రలు సంపూర్ణం కావని భావిస్తుంటారు. కొందరైతే ఈ నగరం చుట్టూ ప్రదక్షిణం కూడా చేస్తుంటారు. ఈ జనక్పురికి 18 కిలోమీటర్ల దూరంలో ‘ధనుషధామ్’ అనే ప్రాంతం ఉంది. రాముడు విరిచిన శివుని ధనుస్సు ఇక్కడే పడిందని భక్తుల నమ్మకం. అందుకే జనక్పురికి వెళ్లినవారు ధనుషధామ్కు కూడా వెళ్లివస్తుంటారు.

- నిర్జర.


More Sri Rama Navami