సరస్వతి రూపంలో జీవితసారం
దసరా సందర్భంగా వచ్చే మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిని పూజించుకోడం సంప్రదాయం. చదువుల తల్లిగా, వాక్కుని నియంత్రించే వాగ్దేవిగా, బుద్ధిని వికసింపచేసే శక్తిగా సరస్వతీ అమ్మవారి ప్రాధాన్యత అంతాఇంతా కాదు. బాసర వంటి పుణ్యక్షేత్రం వెలసిన తెలుగునాట ‘సరస్వతీ నమస్తుభ్యం’ అంటూ ఆ తల్లిని ఆర్తిగా ప్రార్థించని హిందువు ఉండడు. ‘యా కుందేందు తుషార హార..’ అంటూ ఆ తల్లిని వర్ణించే శ్లోకాలని నిత్యం వింటూ ఉంటాము కదా! మరి ఆ రూపం వెనుక ఉన్న మర్మం ఏమిటో...
పేరులోనే పెన్నిధి
సరస్వతి అంటే ప్రవహించేది (నీరు కలిగినది) అన్న అర్థం ఉంది. వేదకాలంలో సరస్వతీ అనే నది ఉన్నదనీ, అది ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్నదని మనకు తెలిసిందే! ఆర్యులు తమ తొలి రోజులలో సరస్వతీ నదీ తీరానే నివసించారన్న వాదనలూ ఉన్నాయి. ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ రుగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. అలా తమకు జీవితాన్ని అందించిన నదీమతల్లిని జ్ఞానానికి కూడా ప్రతిరూపంగా భావించడంలో ఆశ్చర్యం ఏముంది. ‘ప్రవహించేది’ అన్న ఈ పేరు జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. పైగా సరస్వతి అన్న పేరుకి ‘తన గురించి ఎరుకను కలిగించేది’ (సార, స్వ) అన్న తీరులో కూడా కొందరు అన్వయిస్తూ ఉంటారు. జ్ఞానానికి ఉండాల్సిన లక్ష్యం... తన గురించి తాను తెలుసుకోవడమే కదా!
పుస్తకం
అమ్మవారు నాలుగు చేతులలతో ఉన్న చిత్రాలు మనకి కనిపిస్తుంటాయి. ఆమె చేతులలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయుధం లేకపోవడం విశేషం. అమ్మవారు ఒక చేతిలో పుస్తకాన్ని ధరించి ఉంటారు. లౌకికమైన చదువులలో ముందుకు సాగేందుకు తగిన ధారణని అందిస్తానన్న అభయాన్ని అందిస్తుంటారు.
వీణ
చదువంటే కేవలం పుస్తక జ్ఞానమే కాదు కదా! జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ఏదో ఒక కళలో ప్రావీణ్యత ఉండాల్సిందే. అలా చదువులకే కాదు కళలకు కూడా తల్లి అని సరస్వతీ దేవి చేతిలో ఉండే వీణ గుర్తుచేస్తూ ఉంటుంది. వీణలో ఉండే ఏడు తంతులతో సప్తస్వరాలనూ పలికించవచ్చు. జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలనీ, లయబద్ధంగా సాగిపోవాలనే సూచనను వీణ మనకు అందిస్తుంది.
అక్షమాల
పుస్తకాలు చదువుకోవడం, ఏదో ఒక కళలో ప్రావీణ్యత సంపాదించడం మంచిదే. మరి ఆధ్మాత్మిక సాధనో! ఏ పని చేస్తున్నా, ఏ లక్ష్యాన్ని ఛేదిస్తున్నా... మనసులో భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలన్నది పెద్దల మాట కదా! నిరంతరం సాగే ఆ స్మరణకు చిహ్నమే అమ్మవారి చేతిలో ఉన్న జపమాల.
కమలము
సరస్వతీ అమ్మవారు కమలం మీద కూర్చుని ఉన్నట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. కమలం వికాసానికి, పవిత్రతకూ చిహ్నం. పాంపపంకిలమైన సంసారంలో ఉంటూ కూడా తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలనే తపనకు సూచన. జాగృతమైన కుండలినీ శక్తికి సైతం కమలం ప్రతిరూపం. అంటే చదువు, కళలు, భక్తి ఉంటే సరిపోదు... అందమైన వ్యక్తిత్వం కూడా ఉండాలని కమలం సూచిస్తోందన్నమాట.
హంస
హంస నీటినీ పాలనీ విడిస్తుందని పురాణకథలు చెబుతూ ఉంటాయి. ఇలాంటి హంసలు హిమాలయాల్లో ఉంటాయని ఇప్పటికీ చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకం సంగతి అలా ఉంచిదే లోకంలో మంచినీ చెడునీ విడిదీసే విచక్షణకు ప్రతీకగా ఈ హంసను పేర్కొంటూ ఉంటారు. అందుకనే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి చెందిన వ్యక్తిని పరమహంసగా సంబోధిస్తారు.
నెమలి
కొన్ని సందర్భాలలో హంసతో పాటుగా నెమలిని కూడా సరస్వతీదేవి వాహనంగా పేర్కొంటూ ఉంటారు. నెమలి మామూలు సందర్భాలలో ఒద్దికగా కనిపిస్తూనే తగిన వాతావరణం వచ్చినప్పుడు పురివిప్పి ఆడుతుంది. జ్ఞానాన్ని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో.. దానిని ఆర్భాటం కోసం కాకుండా, అవసరాన్ని బట్టి వినియోగించుకోవాలనే సూచన నెమలి అందిస్తోంది. పురివిప్పిన జ్ఞానానికి చిహ్నంగా నిలుస్తోంది.
ధవళ వస్త్రాలు
సరస్వతీ దేవి తెల్లటి వస్త్రాలను ధరించడమే కాదు... ఆమె చుట్టూ ఉన్న కమలము, హంస, పూలదండ, అక్షమాల వంటివి కూడా తెల్లటి రూపంలోనే ఉంటాయి. తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. అంతేకాదు! దూది నుంచి లభించే వస్త్రం ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది. దానికి రంగు వేయడంతోనే దాని సహజత్వాన్ని కోల్పోతుంది. ఎలాంటి ప్రలోభానికీ లొంగకుండా... రాజీలేని జీవితాన్నీ, మచ్చలేని వ్యక్తిత్వాన్ని కలిగి ఉండమని ధవళ వస్త్రాలు సూచిస్తున్నాయి.
ప్రవహించే నీరు
సరస్వతీదేవి పక్కన ఎప్పుడూ ప్రవహిస్తున్న నీరు కనిపిస్తూ ఉంటుంది. ప్రవాహం అభ్యున్నతికి చిహ్నం. ప్రవాహం మార్పుకి సూచని. ఎంత చదువు, విచక్షణ, వ్యక్తిత్వం ఉన్నా అది తనలోనే నిలిచిపోతే మనిషి బురదగుంటలా మారిపోతాడు. పదిమందికీ ఉపయోగపడి, లోకానికి ఆదర్శంగా నిలిచిన రోజునే అతని జీవితం సార్థకమవుతుంది. ప్రవహించే నీటిలా ఉరకలు వేసే సంతోషంలో గడుపుతూ, తన చుట్టుపక్కల వారి ఆర్తిని తీరుస్తూ జీవితాన్ని గడపమంటూ ఈ ప్రవాహం సూచిస్తోంది.
- నిర్జర.