రామ్లీల- రావణదహనం
దసరా అనగానే దక్షిణాదిన అమ్మవారి పూజకి ఎంతగా ప్రాధాన్యత ఉంటుందో, ఉత్తరాదిన రాముని లీలలను గానం చేసేందుకు అంతే ఉత్సాహం చూపుతారు. వారి దృష్టిలో దసరా అంటే అమ్మవారు మహిషాసురుని సంహరించిన రోజు మాత్రమే కాదు... రాముడు, రావణుని చంపిన రోజు కూడా. అందుకే ఈ పది రోజుల పాటు రామాయణంలో ఘట్టాలను వర్ణిస్తూ, చివరి రోజున ‘రావణ దహన్’ పేరుతో రావణుని భారీ దిష్టిబొమ్మను కాలుస్తారు.
500 ఏళ్ల చరిత్ర
ఉత్తరాదిన ఘనంగా సాగే ఈ రామ్లీల సంప్రదాయం ఎప్పుడు మొదలైంది అన్నదానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ 500 ఏళ్లకు పైగానే, ఈ ఆచారం కొనసాగుతోందని మాత్రం జానపద సాహిత్యం ద్వారా తెలుస్తోంది. కాకపోతే 16వ శతాబ్దంలో తులసీదాసు రామచరితమానస్ను రాసిన తరువాత, దాని ఆధారంగా రామలీలలు రూపుదిద్దుకోవడం మొదలుపెట్టాయి. అప్పటివరకూ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని ప్రజలు నిత్యం మాట్లాడుకునే హిందీలో తనదైన శైలిలో అనువదించడంతో, రామచరితమానస్ ఇంటింటి రామాయణంగా మారిపోయింది. దానిని ఆధారం చేసుకుని తులసీదాసు శిష్యుడైన మేఘాభగత్ రామ్లీలకు మరింత ప్రచారాన్ని కల్పించాడు.
ఉత్తరాది అంతటా
రామ్లీల ఫలానా చోట ఫలానా విధంగా సాగుతుందని చెప్పడం కష్టం. ఎందుకంటే ఉత్తరాది అంతా చిన్నచిన్న గ్రామాలు మొదలుకొని, పుణ్యక్షేత్రాల వరకూ ఈ రామ్లీలను వాడవాడలా ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఒకోచోట ఒకోలా సాగడం దీని ప్రత్యేకత. వారణాసి జిల్లాలోని రామ్నగర్లో ఈ రామ్లీలను ఏకంగా 31 రోజులపాటు ప్రదర్శిస్తారు. ఆగ్రాలో జరిగే రామ్లీలలో భాగంగా రాముని కళ్యాణాన్ని (రామ్బారాత్) కూడా నిర్వహిస్తారు. చాలా చోట్ల స్థానిక కళలను, ఆచారాలను, కథలను కూడా మిళితం చేస్తూ ఈ రామ్లీల సాగుతుంది.
ఇలా సాగుతుంది
రామచరిత మానస్ ఆధారంగా ఈ రామ్లీల సాగుతుందని చెప్పుకొన్నాం కదా! ఇందులో భాగంగా రామాయణంలోని ఘట్టాలను సంభాషణలు, పాటలు, పద్యాలు (దోహా), నేపథ్య గాత్రాల సాయంతో సాగిస్తారు. కొన్ని చోట్ల ఇందులోని వేషధారులుగా హైందవేతరులు కూడా ఉండటం గమనార్హం. మరికొన్ని చోట్ల వివాదాలకు తావు లేకుండా ఫలానా వంశస్థులే ఫలానా వేషం వేయాలన్న ఒప్పందం అమలులో ఉంటుంది. ఒకపక్క ప్రాచీన సంస్కృతికి పట్టం కడుతూనే మరో పక్క స్థానిక సంప్రదాయాలను అందులో మిళితం చేసే రామ్లీల అరుదైన కళగా సాగుతోంది. అందుకనే యునెస్కో సైతం 2005లో దీనిని Masterpiece of the Oral and Intangible Heritage of Humanity అనే అరుదైన జాబితా కిందకి చేర్చింది. యునెస్కో వెబ్సైట్ ప్రకారం అయోధ్య, రామ్నగర్, బెనారస్, బృందావన్, అల్మోరా, సత్నా, మధువణిలో సాగే రామ్లీలలు మరింత ప్రత్యేకమైనవి.
రావణదహనం ప్రత్యేకత
రామ్లీల చివరి రోజున విజయదశమినాడు రాముని విజయానికి ప్రతీకగా రావణుని దిష్టిబొమ్మలను తగలబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రావణాసురునితో పాటుగా కుంభకర్ణుడు, మేఘనాధుల దిష్టిబొమ్మలను కూడా ఈ రోజున తగలబెడతారు. చలికాలపు ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాది రాష్ట్రాలలో చలి నుంచి ఉపశమనం పొందేందుకు, అంటువ్యాధులు కలిగించే క్రిములను హరించేందుకు ఈ దహనాలు ఉపయోగపడతాయని అంటారు. ఈ రావణ దహనాల వెనుక ఆధ్మాత్మిక కారణం కూడా కనిపించకపోదు. రావణుడు అహంకారానికి చిహ్నంగా పెద్దలు పేర్కొంటూ ఉంటారు. ఆయన పది తలలు కూడా అందుకు సూచనగానే భావిస్తారు. ఎంతటివాడినైనా అలాంటి అహంకారం రాక్షసునిగా మార్చివేస్తుందనీ, యుక్తాయుక్త విచక్షణని దెబ్బతీస్తుందనీ రావణుని కథతో తెలిసిపోతుంది. అలాంటి అహంకారాన్ని ‘దహనం’ చేయాలనే సూచన ఈ రవణదహనంతో అందుతోంది.
కుంభకర్ణుడు, మేఘనాధుడు
ఇక రావణునితో పాటుగా ఉండే కుంభకర్ణుడు మనిషిలోని బద్ధకానికీ, నిస్తేజానికీ చిహ్నం. అవి ఎంతటి బలవంతుడినైనా అధఃపాతాళాంలోకి దిగజారుస్తాయి. రావణుని కుమారుడైన మేఘనాధుడిది మరో కథ. అతను మహాపరాక్రమవంతుడు. త్రిమూర్తుల నుంచి వారి ఆయుధాలను వరంగా పొందినవాడు. ఇంద్రుని సైతం ఓడించి ఇంద్రజిత్తు అన్న పేరుని గడించినవాడు. మేఘాలలో ఉండి యుద్ధం చేయడం మేఘనాధుని ప్రత్యేకత. చీకట్లను ఆవరింపచేసి మనుషులను అయోమయానికి గురిచేయడం అతని యుద్ధతంత్రం. మేఘనాధుడు మనలోని అజ్ఞానాన్ని ప్రేరేపించే శక్తికి చిహ్నం. ఇలా మనలోని బలహీనతలకి రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తులు చిహ్నలుగా నిలుస్తున్నారు. వారిని దహించి పరిపూర్ణమైన మానవులుగా సాగాలని రావణదహనం చెబుతోంది.
- నిర్జర.