Home » Baby Care » సమ్మర్ ని స్పెషల్ గా మారుద్దాం
సమ్మర్ ని స్పెషల్ గా మారుద్దాం
1) ఈ శెలవులు పిల్లలకి మంచి జ్ఞాపకంగా మిగిలి పోవటానికి, ఆ జ్ఞాపకాలు వచ్చే సంవత్సరమంత వాళ్ళని ఆనందంగా ఉంచేలా చేయటానికి ఏమేం చేయెచ్చో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ రోజు పిల్లలతో తప్పకుండా చేయించి తీరాల్సిన మరో చిన్న పని గురించి చెప్పుకుందాం. కథలు పుస్తకాలూ చదివించి ఉంటారు కదా . అ కధలలోని ముఖ్యమైన విషయం లేదా పిల్లల్ని ఆకర్షించిన అంశం గురించి ఒక పుస్తకంలో రాయమనాలి. పెద్దగా అక్కర్లేదు ఒకటి రెండు లైన్లు అయినా చాలు. అలాగే అవే పాత్రలతో మరో కధ అల్లి రాయమనాలి. మొదట్లో పిల్లలు నాకు రాదంటూ తప్పించుకుంటారు. కాని మనమే కొన్ని సుచనలూ చేస్తూ, సహాయం చేస్తే వాళ్ళు రాయచ్చు. కనీసం కొత్త అలోచన చేస్తారు.
2) పిల్లలు చదివితే సరే కాని, లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చదివి వినిపించి తీరాల్సిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అవే జీవిత చరిత్రలు. పెద్ద పెద్ద గ్రంధాలు అక్కర్లేదు. పిల్లల కోసం వారికి అర్ధమయ్యేరీతిలో ఇప్పుడు చాలా పుస్తకాలు వస్తున్నాయి. మహాత్ముల జీవిత చరిత్రలు చదివాక అందులో వాళ్ళని ఆకర్షించిన విషయాలను ఓ పుస్తకంలో రాయమనలి. మొత్తం చదివాక ఏ అంశం వాళ్ళని ప్రభావితం చేసిందో చూడాలి. దీనివల్ల పిల్లల గ్రాహణశక్తిని అంచనా వేయచ్చు. వాళ్ళు వ్యక్తిత్వంలోని మార్పలును ఇట్టే పసిగట్టచ్చు. మరో విషయం ఏంటంటే ఓ విషయం గురించి చదవటం, దానిని అర్ధం చేసుకోవటం, తిరిగి రాసి పెట్టుకోవటం ఇవన్ని కూడా అ విషయం పిల్లలు మనసుల్లో ముద్రించుకునేలా చేస్తాయి. గాంధీ గారి సత్యం పలకటం అన్న విషయం కావచ్చు, శివాజీ ధైర్యసాహసాలు కావచ్చు. రాజారామోహన్ సంఘసేవ కావచ్చు. చిన్నతనంలోనే పిల్లల మనస్సులో ముద్రించుకుంటే ఆ విషయాలని ప్రత్యేకంగా మనం మళ్ళి నేర్పించక్కర్లలేదు. అవి వారి వ్యక్తిత్వంలో భాగంగా మారి పోతాయి. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
3) పిల్లలు చిన్న చిన్న బొమ్మలు వేయిటం, వస్తువులు తయారు చేయటం వంటివి చేస్తారు, అవి గొప్పగా ఉన్నాయా లేవా అని కాదు. అవి పిల్లల్లోని సృజనాత్మకతకి అద్దం పడతాయి. అలా వాళ్ళు వేసిన బొమ్మలు, తయారుచేసిన బొమ్మలు, వస్తువులు లాంటివి అన్నింటిని కలిపి ఓ చిన్న ఎగ్జిబిషన్ లా ఏర్పాటు చేసి .హాలులో ప్రదర్శనకు పెట్టి, అపార్టుమెంటు వాళ్ళని, ఫ్రెండ్స్ ని పిలిస్తే అందరిలో తన ప్రతిభకి లభించే గుర్తింపు, పిల్లల్ని ఉత్సాహ పరుస్తుంది. అ ఉత్సాహం మరిన్ని విషయాలలో తను మనసుపెట్టి కష్టపడేలా చేస్తుంది. పిల్లల్లో కుదురు, ఏకాగ్రత, చేసే పని పట్ల ఇష్టం లాంటివి చెబితే వచ్చేవి కాదు. వాళ్ళ ప్రవర్తనలో ఓ భాగంగా అవి మారిపోవాలి. అందకు పైన చెప్పుకున్న విషయాల వంటివి సహాయపడతాయి.
4 పిల్లల్లో ఉహాశక్తికి పదును పెట్టే యాక్టివిటీస్ వారిని చురుకుగా ఉంచుతాయి. ఓ విషయాన్ని వినగానే గ్రహించి, తిరిగి దానికి ఓ రుపం ఇవ్వగలిగితే అది వారిలోని భాషానైపుణ్యాన్ని, భావవ్యక్తీకరణ నైపుణ్యానికి పదునుపెట్టినట్టే. ఉదాహరణకి ఆవు, పులి కథని పిల్లలకి చెప్పి అందులో ఆవు, పులి ,దూడ పాత్రలతో పిల్లలని ఓ చిన్న నాటికలా వేయమంటే .. వాళ్ళంతట వాళ్ళే సంభాషణలని ఉహించుకుని చెబుతారు. ఇది పిల్లలకి సరదాగా ఉంటుంది. నిజానికి అది వారిలోని ఉహాశక్తి పదునుపెట్టటమే. ఇలాగే వీర శివాజీ పాత్ర, సుభాష్ చంద్రబోస్ పాత్ర వంటివి కూడా చేయించవచ్చు. వారి గురించి చెప్పి చరిత్రలోని ఓ సంఘటనని పిల్లలకి వివరించి, ఆ సమయంలో ఆ వ్యక్తుల స్పందన ఎలా ఉంటుందో చెప్పమనాలి. ఏకపాత్రాభినయం అంటారు కదా. అదే ఇలా చేయటం వాల్ల పిల్లల్లోబిడియం కూడా పోతుంది.
5) ఇవన్నీ కూడా పిల్లలని ఉత్సాహంగా ఉంచేవే. ఆడుతూ, పాడుతూ పిల్లల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే చిన్న ప్రయత్నాలు. ఇంకా ఇటువంటివి ఎన్నో ఉండవచ్చు. ఆలోచిస్తే పిల్లల్ని కదిలిస్తే బోల్డన్ని అంశాలు కనిపిస్తాయి. కావాల్సిందల్లా అమ్మకి కాస్త తీరిక, ఓపిక అంతే ఏమంటారు.
-రమ