Home » Baby Care » వాళ్ల ఫిర్యాదులు పట్టించుకోండి
వాళ్ల ఫిర్యాదులు పట్టించుకోండి
1) పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రతి చిన్నా అంశాన్ని ఎంతో సునిశితంగా గమనించాల్సి వుంటుంది. అ ఏముంది? మామూలే కదా అని పెద్దవాళ్ళుతీసిపారేసే విషయాలు పిల్లలకి పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. వాటిని పదే పదే చెబుతుంటారు దానికి పెద్దవాళ్ళు ఉరికే సతాయించకంటూ విసుక్కుంటారు. ఇలా ఓ రెండు మూడు సార్లు జరిగాక ఇక పిల్లలు తల్లిదండ్రులుతో ఏ విషయాలు చెప్పరు. ఇక్కడితో పెద్దవాళ్ళు సమస్య తీరిపోయింది. కాని మరి పిల్లలకో ! సమస్య ఇంకా పెద్దదయ్యింది. తనకి తానుగా దానిని ఎదుర్కోవాలి, ఎలా ! ఈ ప్రశ్న పిల్లల వ్యక్తిత్వంపై రకరకాలుగా ప్రభావాన్ని చూచిస్తుందిట. కొంత మందిలో ధైర్యాన్ని, మొండితనాన్ని కలిగిస్తే, మరికొందరిలో అధైర్యాన్ని, భయన్ని కలిగిస్తుందిట.
2) పిల్లలున్న ప్రతీ ఇంట్లో అమ్మలు సాధారణంగా ఎన్నో ఫిర్యాదులు వింటుంటారు. పక్కపిల్లాడు కొట్టాడనో, తన బెంచీలో కూర్చునే అబ్బాయి పుస్తకం చింపాడనో, స్నేహితులు తనని ఆడించటం లేదనో, లేదా క్లాసులో పిల్లలు తనని ఏడిపిస్తున్నారనో, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి పిల్లల ఫిర్యాదులు. ఇవన్ని విన్నప్పుడు మీరెలా రియాక్ట్ అయ్యారో ఒకసారి గుర్తుచేసుకోండి. అ ఏముంది పిల్లలు, పిల్లలు చూసుకుంటారు. చిన్నతనంలో ఇవన్ని మామూలే అని కొట్టిపారేసి "ఊరికే అందరి మీద చాడీలు చెప్పకు" అని కొంతమంది తల్లిదండ్రులు పిల్లల మాటల్ని తేలికగా తీసుకుంటే, మరికొందరు ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటూ ఎదురుతిరగమని పిల్లలకి చెబుతారు, మరికొందరు వాళ్ళే స్వయంగా రంగంలోకి దిగి ఏడ్పించే పిల్లలని బెదిరిస్తారు. ఈ రియాక్చన్స్ అన్ని మన స్థాయిలో, మనం తెసుకునే నిర్ణయాలు, కాని పిల్లల వైపు నుంచి ఆలోచిస్తే! అసలు వాళ్ళా సమస్యకి పరిష్కారం ఏమనుకుంటున్నారు! మన దగ్గర నుంచి వాళ్ళేం ఆశిస్తున్నారు? వాళ్లకేం కావాలి? అని ఎవరైనా అడుగుతారా?
3) పిల్లల ప్రపంచంలో వాళ్లకుండే సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మొదట మనం చెప్పుకున్నట్టు. మనకి పిల్లలు చెప్పే సమస్యలు చాలా చిన్నవిగా, అసలు సమస్యలే కానట్టుగా కనిపిస్తాయి. కాని వాటిని ఎలా ఎదుర్కోవాలో, పక్కపిల్లాడు తనని ఏడిపిస్తుంటే, అ ఉడుకుమోతు తనాన్ని ఎలా దాచుకోవాలో, తనని బెదిరించే పిల్లల నుంచి భయపడకుండా ఉండటం ఎలాగో వాళ్లకి తెలీదు. దాంతో ఆ ఒత్తిడంతా వారి వ్యక్తిత్వంపై పడుతుంది. వాళ్ళ ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే, వయసుతో పాటు వచ్చే మార్పులనుకుని మనం తేలికగా తెసుకుంటాం. కాని వాళ్ళు అ సమస్యలకి వాళ్లకి తోచినట్టుగా పరిష్కారాలు వెదుక్కునే తీరులో భాగమది అని గుర్తించం. అందుకే చైల్డ్ సైకాలజిస్టు 'డాక్టర్ పీటర్ హుక్' ఓమాట చెబుతున్నారు, ప్రతీ రియాక్షన్ కి ముందు ఓ యాక్షన్ లాగా పిల్లల ప్రవర్తనలో వచ్చే ప్రతీ మార్పుకి ఓ కారణం వుంటుంది. అది గమనించాల్సిన భాద్యత తల్లిదండ్రులదే అంటారు ఈయన.
4) మరి అసల పిల్లలు అలాంటి ఫిర్యాదులు చేసినపుడు తల్లిదండ్రులుగా మనం ఏంచేయాలి? ఈ ప్రశ్నకి సమాధానంగా చైల్డ్ సైకాలజిస్టులు ఏమంటున్నారంటే ముందు పిల్లలు చెప్పే ఏ విషయాన్ని అయినా కొట్టి పారెయ్యకూడదు వినాలి. మనం పిల్లలు చెప్పేవి వింటామన్న నమ్మకం కలగాలి వాళ్లకి, అది వాళ్లకి ధైర్యాన్ని ఇస్తుందిట. ఇక అతర్వాత ఇప్పుడు ఏం చేద్దాం ? ఈ ప్రశ్న వాళ్ళనడగగానే వాళ్ళు రకరకాల సమాధానాలు చెబుతారు, అప్పుడు ప్రశంతంగా వినాలి. అ తర్వాత ఈ సారికి ఇలా చేద్దాం అంటూ మనం ఏమనుకుంటున్నామో చెప్పాలి, వినటానికి ఇదంతా సిల్లీగా అనిపించినా ' పెరంటింగ్' అంటే ఇదే అంటున్నారు సైకాలజిస్టులు.
- రమ