Home » Ladies Special » జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకుందాం

జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకుందాం

 



‘‘లైఫ్ బోర్‌గా వుంది’’ అని ఎప్పుడైనా అనిపించిందా?  అయితే చాలా మంచి అవకాశం. రేపు భవిష్యత్తులో మీరు ఏదో సాధించబోతున్నారు అన్న దానికి సంకేతం అది. ఇవి మన మనసులను చదివే నిపుణుల మాటలు. అంతా బావుంది అనిపించినంతసేపూ మనం కొత్తగా ఏమీ ఆలోచించమట. కాబట్టి లైఫ్‌లో కొత్తగా ఏ మార్పూ రాదు. కానీ ఉన్నదాన్ని ఉన్నట్టు అంతా ఇష్టపడటం ఎంతోకాలం చేయలేం. ఏదో ఓ రోజున ‘బోర్’ అనిపిస్తుంది. ఇంకేదో కావాలనిపిస్తుంది. ఓ బ్రేక్, ఓ మార్పు కావాలని అనిపిస్తుంది. అదిగో అలా అనిపించింది అంటే అది లైఫ్‌లో సరికొత్త మార్పుకి శ్రీకారమే కదా అంటున్నారు నిపుణులు. మరి అలా బ్రేక్ కావాలి, మార్పు కావాలి అనిపిస్తే అందుకు ఏం చేయాలి?

మనం గడిపే జీవితంలో కొత్తగా ఇంకేమన్నా మార్పులు జరిగితే బావుండును అనిపించగానే చాలామంది ఏముంది- ఇంతే, ఈ లైఫ్ ఇలా గడవాల్సిందే వంటి నైరాశ్యంలో పడిపోతారు ముందు. ఆ తర్వాత నెమ్మదిగా ఏం చేయొచ్చు అన్న విషయం కోసం ఆలోచిస్తారు. నిజానికి అందులో కొద్దిమంది మాత్రమే అనుకున్న దిశగా అడుగులు వేస్తారు. తాము కోరుకున్న మార్పుని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తారు. దానినుంచి లభించే ఆనందాన్ని రుచి చూస్తారు. ఆ కొద్దిమందిలో మీరూ వున్నారా.. లేరా? అయితే ఆ లిస్ట్ లో చేరాలంటే మనమేం చేయాలనేది నిపుణులు చెబుతున్నారు.

లైఫ్‌లో మార్పు కావాలని అనిపిస్తే ఆ మార్పు బయట ఎక్కడినుంచో రాదు. అది మనలో రావాలి అంటున్నారు నిపుణులు. ముందుగా మన పరిధులు, పరిమితులు, పరిస్థితులు, వయస్సు వంటి వాటి గురించి ఆలోచించడం, భయపడటం, సందేహపడటం మానేయాలి. వీటన్నిటినీ పక్కన పెట్టి ఏ మార్పు అయితో మీకు ఆనందాన్నిస్తుందని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారో ఆ మార్పు గురించి ఆలోచించండి. ఆ తరువాత దానిని అమలు చేయడమెలాగో చూడండి. ప్రయత్నించండి. గట్టి  సంకల్పం వుంటే ఏదీ అసాధ్యం కాదని గుర్తుంచుకోండి.

మీకు నచ్చిన ఓ కోర్స్ చేయడం, సగంలో ఆపేసిన హాబీని తిరిగి నేర్చుకోవడం, కొత్తగా ఓ హాబీని అలవర్చుకోవడం, ఈవినింగ్ కాలేజీలో చేరడం లేదా ఓ కొత్త భాషను నేర్చుకోవడం, సమాజసేవ, ఓ వ్యాపారం.. ఇలా ఏదైనా కావచ్చు. తప్పకుండా ఓ మంచి ప్రయత్నే అవుతుంది.. జీవితాన్ని ఇప్పటికంటే అందంగా మారుస్తుంది. నచ్చడం లేదంటూ పరిస్థితులను, జీవితాన్ని తిట్టుకుంటూ గడపటం, ఆ అసంతృప్తిని ఇంట్లోవారిపై చూపించడం, మనల్ని మనం బాధపెట్టుకోవడం కంటే జీవితాన్ని నచ్చినట్టు మార్చుకోవడం ఎంతో సులువు.

అనుకుంటాంగానీ, మన గట్టి సంకల్పం ముందు కొండలైనా తలవంచాల్సిందే. అందుకు ఉదాహరణగా నిత్యం మనకు ఎంతోమంది స్త్రీలు విజయబావుటా ఎగరేస్తూ కనిపిస్తూ వుంటారు. వారిని చూసి ఆనందపడి, అచ్చెరువొందే మనం రేపటి రోజున మరొకరికి స్ఫూర్తిగా నిలవగలం. చిన్న ప్రయత్నం, గట్టి సంకల్పం, మరింత  తపన చాలు జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకోవడానికి. ఏమంటారు?

-రమ ఇరగవరపు



Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.