Home » Beauty Care » చలికాలంలో కాలి మడమల పగుళ్లు తగ్గించే సూపర్ టిప్స్..!
చలికాలంలో కాలి మడమల పగుళ్లు తగ్గించే సూపర్ టిప్స్..!
వింటర్ సీజన్ దగ్గరయ్యే కొద్దీ చర్మం పొడిబారడం, పగుళ్లు ఏర్పడటం మొదలవుతుంది. ముఖ్యంగా మడమలు చాలా పగుళ్లు వస్తాయి. పగిలిన మడమలు అసహ్యంగా కనిపించడమే కాకుండా వాకింగ్ చేసేటప్పుడు బట్టలు, కార్పెట్‌తో పదేపదే తగలడం వల్ల నొప్పి పెరుగుతుంది. ఈ పరిస్థితి అనుభవించే ప్రతి మహిళ శీతాకాలంలో తన పాదాలు సాధారణ సీజన్ లో లాగా మృదువుగా ఉండాలని కోరుకుంటుంది. ఇందుకోసం మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కూడా వాడతారు. కానీ వీటి వల్ల ఫలితాలు పెద్దగా ఉండవు.
అయితే పైసా ఖర్చు లేకుండా ఇంట్లోని వస్తువుల సాయంతో వాటిని చక్కదిద్దుకోవచ్చు. పగిలిన మడమలను నయం చేయడానికి డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇందుకోసం ఏ టిప్స్ ఫాలో కావాలి తెలుసుకుంటే..
కొబ్బరినూనెతో మడమలకు క్రీమ్ తయారుచేయడం..
కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ నూనె శతాబ్దాలుగా చర్మ సంరక్షణకు ఉపయోగించబడుతోంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మానికి తేమను అందించి మృదువుగా చేస్తాయి. ఇంట్లోనే క్రాక్ క్రీమ్ చేయడానికి కిందిపదార్థాలు అవసరం.
కొబ్బరి నూనె - 4 టీస్పూన్లు
పెట్రోలియం జెల్లీ - 1 టీస్పూన్
విటమిన్ ఇ క్యాప్సూల్- 1
కర్పూరం పొడి - 1/2 టీస్పూన్
తయారు విధానం..
ముందుగా ఒక గిన్నెలో 4 చెంచాల కొబ్బరి నూనె వేసి వేడి చేసి అందులో ఒక చెంచా పెట్రోలియం జెల్లీ వేసి బాగా కలపాలి.
దీని తరువాత కరిగించిన నూనెలో విటమిన్ ఇ క్యాప్సూల్, అర టీస్పూన్ కర్పూరం పొడి వేసి బాగా కలపాలి. ఇది పేస్ట్ లాగా మారేవరకు కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఒక జాడీలో నింపి చల్లారనివ్వాలి. పాదాల పగుళ్లను నయం చేయడానికి ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ పాదాలకు రాసుకుంటే మంచిది.
స్క్రైబ్..
మడమలు రీసెంట్ గానే పగుళ్లు ప్రారంభమైనట్లయితే, వాటిని ఎప్పటికప్పుడు స్క్రబ్ చేయడం చాలా ముఖ్యం. స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. ఇందుకోసం ఓట్స్ స్క్రబ్‌ని ఉపయోగించవచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. దీన్ని తయారు చేయడానికి కింది పదార్థాలు అవసరం.
ఓట్స్ - 3 స్పూన్లు
పాలు - 1 చిన్న గిన్నె
గ్లిజరిన్ - 1 టీస్పూన్
తయారీ విధానం..
ముందుగా ఓట్స్ గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి.
ఇప్పుడు అందులో పాలు, గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
హీల్స్ డెడ్ స్కిన్‌ను శుభ్రం చేసే స్క్రబ్ రెడీ అయినట్టే.
దీన్ని మడమల మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.
10-15 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి.
ఈ స్క్రబ్ పగిలిన మడమలను నయం చేయడంలో మాత్రమే కాకుండా చర్మాన్ని మృదువుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
*రూపశ్రీ.