Home » Baby Care » Breast Milk Is Best
బిడ్డలకు తల్లిపాలే అమృతమని ఇందుకే అన్నారు..
సరైన పోషకాహారం పిల్లల మొత్తం ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. నవజాత శిశువుకు శరీరానికి అవసరమైన అన్ని పోషకాల కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆ పోషకాలన్నీ తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. అందుకే బిడ్డకు తల్లిపాలు అమృతసమానమన్నారు పెద్దల నుండి వైద్యుల వరకు. ప్రసవం తర్వాత వచ్చే మొదటి చిక్కటి పసుపు పాలు పిల్లల ఆరోగ్యానికి అమృతంలానే పనిచేస్తాయి. వీటిని ముర్రుపాలు అని అంటారు. ప్రసవించిన తరువాత గంటలోపు పిల్లలకు ముర్రుపాలు పడితే అవి పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదం చేస్తాయి. కేవలం ముర్రుపాలు మాత్రమేకాదు. పిల్లలకు రోజువారీ తల్లిపాలు ఇవ్వడమే శ్రేష్టం. తగినంత పరిమాణంలో తల్లిపాలు ఉండేలా చూసుకోవడం ప్రసవించిన ప్రతి మహిళకూ అవసరమని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
తల్లిపాలివ్వడం గురించి పక్కన పెడితే బిడ్డను మోసి కనడంతో తమ అందం చెదిరిపోతుందనే అపోహలో చాలామంది మహిళలున్నారు. కానీ బిడ్డను మోసి కనడంలో ఉన్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ప్రసవం తరువాత కూడా తల్లి పాలివ్వడంలో ఆలోచించే మహిళలు చాలామంది ఉంటున్నారు. అందుకే తల్లిపాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, బిడ్డలకు తల్లిపాలు ఇచ్చేలా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ జరుపుకుంటారు. పుట్టిన ఆరు నెలల వరకు నవజాత శిశువుకు రోజూ తల్లిపాలు అందేలా చూడాలని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలలో ఉండే సూక్ష్మపోషకాలు నవజాత శిశువుల మెదడు అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు కూడా వెల్లడించాయి.
శిశువు ఆరోగ్యంపై తల్లిపాలు వల్ల కలిగే ప్రభావాలు..
శిశువు ఆరోగ్యంపై తల్లిపాలు వల్ల కలిగే ప్రభావాలను అర్థం చేసుకోవడానికి కొన్ని పరిశోధనల్లో ప్రయత్నించారు. బాల్యంలో తల్లి పాలివ్వడం ద్వారా పొందిన సూక్ష్మపోషకాలు వృద్ధాప్యంతో మెదడు సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనల్లో తేలింది. క్రమం తప్పకుండా తల్లిపాలు తాగే పిల్లలు తల్లిపాలు లేని పిల్లల కంటే ఎక్కువ మేధో అభివృద్ధి, పనితీరును కలిగి ఉంటారు.
బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో ప్రయోజనాలు..
పిల్లలకు తల్లిపాలివ్వడం ప్రారంభించిన మొదటి నెలలలో మైయో-ఇనోసిటాల్ అనే సూక్ష్మపోషకం తల్లిపాలలో ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న శిశువు మెదడుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది, ఇది మెదడులోని న్యూరాన్ల మధ్య సినాప్సెస్ లేదా కనెక్షన్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా, భవిష్యత్తులో నరాల సంబంధిత సమస్యల ప్రమాదాలను తగ్గించడంలో మెరుగ్గా ఉంటుంది.
శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే..
మొదటి నెలల్లో పిల్లల మెదడు ముఖ్యంగా ఆహార లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. సూక్ష్మపోషకాలు మెదడుపై ఎలా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయనేది విషయం పట్ల న్యూరో సైంటిస్ట్ లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తల్లిపాలలో ఇంత గొప్ప పోషకాలు ఎలా ఉంటున్నాయనేదాని మీద కూడా వీరు ఏ నిర్ణయాన్నిస్పష్టంగా చెప్పలేకున్నారు. కానీ తల్లిపాలు బిడ్డ మెదడు అభివృద్ధిలో వివిధ దశలకు కూడా సహాయం చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏది ఏమైనప్పటికీ 6నెలల లోపు పిల్లలకు తల్లిపాలకు మించిన గొప్పఆహారం దొరకదనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ప్రసవించిన స్త్రీకి సహజంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే పాలు బిడ్డల ఆరోగ్య భవిష్యత్తుకు వరం.
*నిశ్శబ్ద.