Home » Beauty Care » మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉన్నాయా..ఇలా చేస్తే నలుపు మాయం!
మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉన్నాయా..ఇలా చేస్తే నలుపు మాయం!
అందంగా కనిపించడం ప్రతి ఒక్కరికి ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలకు అందంగా కనిపించాలని చాలా కోరికగా ఉంటుంది. దీని కోసం ధరించే దుస్తుల నుండి రెగ్యులర్ గా వాడే బోలెడు ఉత్పత్తుల వరకు అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే దుస్తులు ఎంత అందంగా ఉన్నా, వాడే ఉత్పత్తులు ఎంత ఖరీదైనవి అయినా శరీరంలో బయటకు ఎబ్బెట్టుగా కనిపించే కొన్ని విషయాలు ఇబ్బందికి గురిచేస్తాయి. అలాంటి వాటిలో మెడ నలుపు, మోకాళ్లు, మోచేతుల నలుపు కూడా ముఖ్యమైనది. వీటిని తొలగించుకోవడానికి బోలెడు ఇంటి చిట్కాల నుండి వాణిజ్య ఉత్పత్తుల వరకు చాలా వాడుతుంటారు. అయితే ఇంట్లోనే ఈ నలుపును వదిలించుకోవాలి అంటే ఈ టిప్స్ పాటించాలి.
కొబ్బరినూనె..
తలకు రాసుకునే కొబ్బరినూనె మోచేతులు, మోకాళ్లపై నలుపు పోగొడుతుందా అనే అనుమానం వస్తుంది. కానీ కొబ్బరి నూనె ఈ సమస్యకు పరిష్కారంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను నల్లగా ఉన్న మోచేతులు, మోకాళ్ల చర్మం మీద మర్థనా చేస్తుంటే రఫ్ గా ఉన్న చర్మం సాధారణంగా మారుతుంది. ఇది క్రమంగా చర్మం మీద నలుపును కూడా తొలగిస్తుంది.
నిమ్మకాయ, పంచదార..
పంచదార, నిమ్మకాయ మిశ్రమంతో మోచేతులు, మోకాళ్ల నలుపు వదిలించుకోవచ్చు. నిమ్మకాయ చెక్కను పంచదారలో ముంచి మోకాళ్లు, మోచేతుల చర్మం పైన స్క్రబ్ చేయాలి. ఇది చర్మం నలుపును తొలగించడంలో సహాయపడుతుంది.
శనగపిండి, టమాటా..
శనగపిండి చర్మ సంరక్షణలో చాలామంది వాడతారు. ఇది ఎంత శ్రేష్టమంటే సున్నితంగా ఉండే చిన్న పిల్లల చర్మానికి కూడా వాడతారు. టమాటాలో ఉండే సమ్మేళనాలు చర్మాన్ని క్లియర్ చేస్తాయి. శనగపిండిలో టమాటా జ్యూస్ కలిపి నల్లగా చర్మం మీద రాయాలి. అనంతరం మర్దనా చేయాలి. దీన్ని ఒక అరగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నలుపు క్రమంగా తగ్గుతుంది.
వోట్స్, పెరుగు..
ఓట్స్ కూడా ఈ మధ్యకాలంలో చర్మ సంరక్షణలో ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా వోట్స్ బెస్ట్ స్క్రబ్ గా పనిచేస్తుంది. ఓట్స్ లో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మం మీద అప్లై చేసి సుమారు 10 నుండి 15 నిమిషాలు మర్దనా చేయాలి. ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.
*రూపశ్రీ.